Danam Nagender Disqualification Case | ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే ‘దానం’ అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు.. అసలు ఏం జరిగింది?

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్రిబ్యునల్‌గా విచారణ చేపట్టినప్పటికీ, దానం నాగేందర్ స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆధారాలు లేవంటూ ఆ పిటిషన్లను తిరస్కరించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Danam Nagender Disqualification Case | ఖైరతాబాద్ Khairtabad ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించనుంది. గత నెలలో సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం ఆదేశాలను రిజర్వ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.

Danam Nagender Disqualification Case | కేసు వెనుక ఉన్న అసలు కారణాలు

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ (BRS) అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి ఆయన దన్నుగా నిలిచారు.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే దానం నాగేందర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు.

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం.. ఒక పార్టీ తరఫున గెలిచి, మరో పార్టీ కండువా కప్పుకోవడం లేదా ఆ పార్టీ బీ-ఫారమ్‌పై పోటీ చేయడం స్వచ్ఛందంగా స్వపక్ష సభ్యత్వాన్ని వదులుకోవడమే అవుతుందని ప్రతిపక్షాల వాదన. ఈ నేపథ్యంలో దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, భాజపా శాసనసభా పక్ష నేత అల్లేటి మహేశ్వర్‌రెడ్డి.. వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

Danam Nagender Disqualification Case | స్పీకర్ తిరస్కరణ..

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్రిబ్యునల్‌గా విచారణ చేపట్టినప్పటికీ, దానం నాగేందర్ స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆధారాలు లేవంటూ ఆ పిటిషన్లను తిరస్కరించారు.

దీంతో స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ విపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీగా పోటీ చేయడం, కాంగ్రెస్ ప్రచారాల్లో పాల్గొనడమే ఆయన పార్టీ మారారనడానికి ప్రత్యక్ష నిదర్శనమని.. స్పీకర్ ట్రిబ్యునల్ ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేసిందని కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు వాదించారు.

Samantha Seemantham | సీమంతంలో శ్రీవిద్యా సొబగులు..కళా ఆవరణలో మాతృత్వానికి దైవత్వపు అభిషేకం!

కాగా, అసెంబ్లీ రికార్డుల్లో ఇప్పటికీ తాను భారాస ఎమ్మెల్యేగానే ఉన్నారని, కేవలం పత్రికా ప్రకటనలు, ఫొటోల ఆధారంగా అనర్హత వేటు వేయలేరని దానం న్యాయవాదులు వాదించారు. ఈ కేసు తీర్పు రాష్ట్రంలోని ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠగా మారింది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *