Drug Assets Seized | డ్రగ్స్​ అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులు జప్తు: సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాల అక్రమ తయారీ, రవాణా, సరఫరాపై పోలీస్​శాఖ ఉక్కుపాదం మోపుతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే,నిజామాబాద్​ క్రైం: Drug Assets Seized | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాల అక్రమ తయారీ, రవాణా, సరఫరాపై పోలీస్​శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు బోధన్​ రూరల్​ సీఐ విజయ్​ బాబు ఆధ్వర్యంలో డ్రగ్స్​ నెట్​వర్క్​ను పోలీసులు ఇటీవల ఛేదించారు.

Drug Assets Seized | అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్ల అరెస్ట్

బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్ప్రాజోలం తయారీ, సరఫరాకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లపై ఎన్​డీపీఎస్​ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు 2.5 కిలోల అల్ప్రాజోలం, దాని విలువ సుమారు రూ.25 లక్షలు, స్కోడా కారు, 8 మొబైల్ ఫోన్లు, రూ.2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Drug Assets Seized | మహారాష్ట్రలో తయారీ కేంద్రం గుర్తింపు

కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించగా అల్ప్రాజోలం తయారీ, సరఫరాకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. సీపీ ఆదేశాల మేరకు బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు ఆధ్వర్యంలో సుమారు 15 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందం మహారాష్ట్రకు వెళ్లి వారం రోజుల పాటు విస్తృతంగా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని సతారా పారిశ్రామిక ప్రాంతంలో, ‘సూర్య ప్రభ ఫార్మా కెమ్’ పేరుతో ఎరువుల తయారీ కోసం అనుమతులు పొంది, అక్రమంగా అల్ప్రాజోలం తయారు చేస్తున్న ఫ్యాక్టరీని గుర్తించారు. అక్కడ నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.3 కోట్ల విలువైన సుమారు 30 కిలోల అల్ప్రాజోలం, అక్రమంగా సంపాదించిన రూ.12 లక్షల నగదు, ఒక ఫోర్డ్ కారును స్వాధీనం చేసుకుని, ఫ్యాక్టరీని సీజ్ చేశారు.

Drug Assets Seized | ఆస్తుల జప్తు..

డ్రగ్స్​ అమ్మకాలు, తయారీ ద్వారా కూడబెట్టిన రూ.5.15 కోట్ల ఆస్తులను జప్తు చేసేందుకు పోలీస్​శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పూణే, సతారా, అహ్మద్‌నగర్ జిల్లాల్లో సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాలను సంప్రదించి నిందితులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించారు. నిందితులు అమర్‌సింగ్, బసవరాజ్, లక్ష్మణ్ గౌడ్, వారి కుటుంబ సభ్యులు అల్ప్రాజోలం అక్రమ విక్రయాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించారు. ప్రభుత్వ విలువల ప్రకారం సుమారు రూ.5.15 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించగా, బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ మరింత ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Drug Assets Seized | యువత, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి : సీపీ

సీపీ మాట్లాడుతూ..యువత, విద్యార్థులకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు , విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ నిల్వ, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు.

ఇది కూడా చదవండి..: BJP Protest | కలెక్టరేట్​ వద్ద ఉద్రిక్తత.. మంత్రి పొంగులేటి రాజీనామాకు బీజేపీ డిమాండ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *