అక్షరటుడే, భీమ్‌గల్: Farmer ID Registration | వ్యవసాయ రంగంలో పారదర్శకతను పెంచి, అర్హులైన ప్రతి రైతుకూ సంక్షేమ ఫలాలు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ (రైతు డిజిటల్ నమోదు) ప్రక్రియ నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో కీలకంగా మారింది. అయితే కొంతమంది రైతులు ఇప్పటికీ తమ పేర్లు రిజిస్టర్ చేయించుకోకపోవడంతో వారి ప్రభుత్వ పథకాలకు దూరమయ్యే అవకాశం ఉంది.
Farmer ID Registration | జిల్లాలో 2,92,639 మంది రైతులు..
జిల్లా వ్యవసాయ శాఖ తాజా గణాంకాల ప్రకారం (ఈనెల ఏడో తేదీ నాటికి) జిల్లాలో ఉన్న 2,92,639 మంది రైతుల లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 2,38,426 మంది నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 81.47 శాతం నమోదు నమోదైంది. ప్రభుత్వం నిర్దేశించిన వందశాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ఇంకా 54,213 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంది.
Farmer ID Registration | ఎఫ్‌ఎఫ్ఎస్ యాప్‌లోనే ఎరువుల కేటాయింపు
ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’ యాప్ ద్వారానే రాయితీ ఎరువుల పంపిణీ సాగుతోంది. యూరియా, డీఏపీ, పొటాష్ వంటి ఏ రకమైన రాయితీ ఎరువులు కావాలన్నా విక్రయ కేంద్రాలు లేదా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద ఫార్మర్ ఐడీ లేదా దానికి అనుసంధానించిన ఆధార్ సంఖ్యను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ వేదికగా వివరాలు సరిపోలితేనే సబ్సిడీ ధరపై ఎరువుల బుకింగ్ జరిగి పంపిణీ చేస్తారు.
Farmer ID Registration | లక్ష్య సాధనలో ‘మోర్తాడ్’ ఫస్ట్..
జిల్లాలోని మండలాల వారీ ప్రగతిని పరిశీలిస్తే, మోర్తాడ్ మండలం 86.21శాతం నమోదుతో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులు , ప్రజాప్రతినిధులు మరియు రైతులు భాగస్వాములు కావడంతో ఇక్కడ నమోదు వేగవంతంగా సాగింది.
Farmer ID Registration | అట్టడుగున ‘నిజామాబాద్ సౌత్’!
జిల్లాలోని భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, మోపాల్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ సౌత్ మండలాల్లో ఆశించిన స్థాయిలో రైతులు తమ పేర్లను ఆధార్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోలేదు. పట్టణ పరిసర ప్రాంతమైన నిజామాబాద్ సౌత్ మండలంలో అత్యల్పంగా కేవలం 29.13శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. కొందరు రైతులు స్థానికంగా అందుబాటులో లేకపోవడం, భూముల స్వభావ మార్పులు మరియు అవగాహన లోపమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Farmer ID Registration | ఫార్మర్ ఐడీతో రైతులకు కలిగే ప్రయోజనాలు..
ఎఫ్‌ఎఫ్ఎస్ యాప్ ద్వారా మాత్రమే ఫార్మర్ ఐడీ ఆధారంగా విత్తనాలు, ఎరువుల కేటాయింపు సాగుతుంది. పీఎం కిసాన్, రైతు భరోసా, వర్షాలు, కరవు వల్ల పంట నష్టపోతే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ పరిహారం ఏ మధ్యవర్తి ప్రమేయం లేకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడతాయి. బ్యాంకులలో సులభంగా పంట రుణాలను పొందడానికి, ప్రకృతి విపత్తుల సమయాల్లో పంట బీమా క్లెయిమ్ ప్రక్రియ సులభతరం కానుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, ఇతర పంటల విక్రయాల కోసం ఐడీ ప్రాతిపదికన దళారుల బారిన పడకుండా మద్దతు ధర లభిస్తుంది.
Farmer ID Registration | రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నష్టాలివే..
డిజిటల్ రిజిస్ట్రేషన్ లేకపోతే సొసైటీలు, ఫెర్టిలైజర్ డీలర్ల వద్ద సబ్సిడీ ఎరువులు, విత్తనాలు బుక్ కావు. ఫార్మర్ ఐడీ లేని రైతులకు పీఎం కిసాన్, పెట్టుబడి సాయం వంటి పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. పండించిన దిగుబడిని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్మడానికి సాంకేతిక అవరోధాలు ఎదురవుతాయి.
Farmer ID Registration | రైతులు వెంటనే నమోదు చేసుకోవాలి..
– వీరాస్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, నిజామాబాద్.
ఫార్మర్ ఐడీ నమోదును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. జిల్లాలో ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోని 54,213 మంది రైతులు వెంటనే తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా సమీప మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలి. పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ వివరాలు అందించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు మరియు సంక్షేమ పథకాలు అందాలంటే ఈ నమోదు తప్పనిసరి.
ఇది కూడా చదవండి..: RTC Workers Welfare | ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎస్‌డబ్ల్యూయూ కృషి