Farmers Cases | రైతులపై నమోదైన కేసుల ఎత్తివేతకు చర్యలు: డీజీపీ సీవీ ఆనంద్

గతంలో రైతులపై నమోదైన కేసుల అంశాన్ని ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Farmers Cases | గతంలో రైతులపై నమోదైన కేసుల అంశాన్ని ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంబంధిత కేసుల విషయంలో తప్పకుండా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Farmers Cases | మోపాల్​ పోలీస్​స్టేషన్​ భవనాన్ని..

నూతనంగా నిర్మించిన మోపాల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. మోపాల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, సర్పంచులు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నిత్యావసర సేవలు అందించే ముఖ్యమైన కార్యాలయాల్లో తహశీల్దార్ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్ కూడా ఒకటని పేర్కొన్నారు. అలాంటి కీలకమైన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమన్నారు.

Farmers Cases | జిల్లా నాకు పాతదే..

నిజామాబాద్ జిల్లా తనకు కొత్తేమీ కాదని, గతంలో ఇక్కడ పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలు చూపిన ఆత్మీయ స్వాగతం పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చిందన్నారు. తన కుమారుడు సైతం నిజామాబాద్ జిల్లాలో తాను పనిచేస్తున్న సమయంలోనే జన్మించాడని, ఆ అనుబంధంతోనే తన కుమారుడికి నిఖిల్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ సబ్ డివిజన్ పరిధి విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున పరిపాలన, పోలీసింగ్ సౌలభ్యం కోసం ప్రత్యేకంగా ఎనిమిది పోలీస్ స్టేషన్లతో రూరల్ డివిజన్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే మోపాల్ నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలు శాంతియుత స్వభావం కలిగిన వారని, ఎన్నికలు సైతం ప్రశాంతంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తూ పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

Farmers Cases | సమష్టి కృషితో నిర్మాణం..

ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, గ్రామాల సర్పంచులు, ప్రజలు, నాయకుల సమిష్టి సహకారంతో మోపాల్ పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణం పూర్తి కావడం అభినందనీయమన్నారు. షేర్ వాల్ టెక్నాలజీతో స్కైపాత్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఆధునిక పద్ధతిలో ఈ భవనాన్ని నిర్మించడం సంతోషకరమన్నారు. మండల పరిధిలోని గ్రామాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా నిలిచి పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సహకరించడం ప్రజల ఐక్యతకు నిదర్శనమన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజాసేవ చేయడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని తెలిపారు. ప్రజల సహకారం, పోలీసుల సమర్థవంతమైన విధుల నిర్వహణతో జిల్లాలో నేరాల రేటును మరింత తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక చొరవ, సహకారంతో నిజామాబాద్ రూరల్ పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు.

Farmers Cases | రైతులపై పెట్టిన కేసుల విషయంలో..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిప్ప ప్రాణహిత-చేవెళ్ల 21వ ప్యాకేజీ సాధన కోసం పోరాడిన రైతులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డీజీపీని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అలాగే పసుపు, ఎర్రజొన్న రైతులపై రాజకీయ కారణాలతో నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మల్టీ జోన్-1 ఐజీపీ (IGP) కార్తికేయ, డీఐజీ (DIG) నారాయణ్ నాయక్, సీపీ సాయి చైతన్య, ఏసీపీ ప్రకాష్ యాదవ్, ఎస్​హెచ్​వో (SHO) సుష్మిత, రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ ఛైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మోపాల్ మండల ప్రజాప్రతినిధులు, గ్రామాల సర్పంచులు, నాయకులు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Stray Dogs | అక్షరటుడే ఎఫెక్ట్.. వీధికుక్కల సమస్యపై స్పందించిన కలెక్టర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *