అక్షరటుడే వెబ్‌డెస్క్: Oasis Fertility Scam | దేశవ్యాప్తంగా కలకలం రేపిన అనధికారిక అండకణాల సేకరణ, అక్రమ రవాణా కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఒయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రాలను నిర్వహిస్తున్న సద్గురు హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ప్రతీక్ అనిల్ గగ్లానీ, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేబ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు మల్కాజిగిరి సీపీ సుమతి వెల్లడించారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 1145/2026 కింద నమోదైన ఈ కేసులో ఇప్పటికే దుర్గా ప్రసాద్, అమిత్, ఎన్. నికాత్ పర్వీన్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Oasis Fertility Scam | అండదాతల తరలింపు..
పోలీసుల విచారణ ప్రకారం, హైదరాబాద్‌లో ( Hyderabad ) ఒయాసిస్ ఫెర్టిలిటీ పేరుతో సద్గురు హెల్త్‌కేర్ 10 కేంద్రాలను నిర్వహిస్తుండగా, అందులో బంజారాహిల్స్, మియాపూర్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో నాలుగు లెవల్-II ఐవీఎఫ్ (IVF) క్లినిక్‌లు ఉన్నాయి. మియాపూర్‌లోని సద్గురు ఏఆర్టీ (ART) బ్యాంక్ కేంద్రంగా అండదాతల సేకరణ జరిగినట్లు గుర్తించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఏజెంట్ల సాయంతో మహిళలను గుర్తించి ఇక్కడికి తీసుకువచ్చి, అండాల ఉత్పత్తిని ప్రేరేపించే ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత సంతానోత్పత్తి కేంద్రాలకు తరలించి అండకణాలను సేకరించినట్లు దర్యాప్తులో తేలింది.
Oasis Fertility Scam | ఉన్నతాధికారుల పాత్ర..
2025 నుంచి సంస్థ సీఓఓగా పనిచేస్తున్న ప్రతీక్ అనిల్ గగ్లానీ కార్యకలాపాల నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు, కొత్త కేంద్రాల ఏర్పాటు బాధ్యతలు చూశారు. సీఎఫ్ఓ (CFO) ద్వారా నిధుల సమన్వయం జరిగినట్లు, అండదాతల ప్యాకేజీల వివరాలను రోగులకు తెలియజేయడంతో పాటు ఏఆర్టీ బ్యాంక్ ఇన్‌చార్జ్‌తో ఆయన తరచూ సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇక 2026 ఏప్రిల్ నుంచి మెడికల్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న డాక్టర్ రాజర్షి దేబ్ క్లినికల్ క్వాలిటీ, ఆపరేషన్ థియేటర్ల సిద్ధత, వైద్యుల నియామకాలను పర్యవేక్షించారు. అండదాన విధానాలకు అంగీకరించే వైద్యులనే నియమించాలన్న యాజమాన్య సూచనల మేరకు ఆయన వ్యవహరించారని, ఏఆర్టీ బ్యాంక్ ఇన్‌చార్జ్ సునీల్ రాయ్‌తో ఫోన్‌లో సమన్వయం చేసుకున్నారని విచారణలో వెల్లడైంది.
Oasis Fertility Scam | నెలకు రూ. 28 కోట్ల ఆదాయం..
దేశవ్యాప్తంగా సంస్థ నిర్వహిస్తున్న 43 క్లినిక్‌లలో ప్రతి నెలా సుమారు 600 సెల్ఫ్ ఎగ్ సైకిళ్లు, 100 అండదాత సైకిళ్లు జరుగుతున్నాయని, వీటి ద్వారా నెలకు రూ. 27 కోట్ల నుంచి రూ. 28 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోందని పోలీసులు అంచనా వేశారు. 2026 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 26 వరకు సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంకు ఖాతాలో భారీగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అక్రమ కార్యకలాపాల గురించి తెలిసినప్పటికీ ఆర్థిక ప్రయోజనాల కోసమే నిందితులు సహకరించారని పోలీసులు పేర్కొన్నారు. సీఓఓ ప్రతీక్ అనిల్ గగ్లానీకి నెలకు సుమారు రూ. 4.20 లక్షల వేతనం, డాక్టర్ రాజర్షి దేబ్‌కు నెలకు సుమారు రూ. 23.60 లక్షల పారితోషికం అందినట్లు దర్యాప్తులో తేలింది.
Oasis Fertility Scam | డిజిటల్ ఆధారాల స్వాధీనం..
నిందితుల నుంచి పోలీసులు డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రతీక్ అనిల్ గగ్లానీ వద్ద నుంచి ఐఫోన్ 13 ప్రో సహా మరో పాత మోడల్ ఐఫోన్‌ను, డాక్టర్ రాజర్షి దేబ్ వద్ద నుంచి ఐఫోన్ 14 ప్రోను జప్తు చేశారు. ఈ ఫోన్లలోని డేటాను విశ్లేషించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో విచారణ కొనసాగుతోందని, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని మల్కాజిగిరి సీపీ సుమతి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Nizamabad Rural Police | రూరల్‌లో పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టాలి..