అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Ganesh Festival Security | నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ చవితి (Ganesh Chavithi) వేడుకల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీ సాయిచైతన్య(CP Saichaitanya) ఆదివారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Ganesh Festival Security | పటిష్ట భద్రత ఏర్పాట్లు..
ఈ సందర్భంగా గణేష్ మండపాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు, పోలీస్ సిబ్బంది విధులు, ట్రాఫిక్ పరిస్థితులు, ప్రజల రాకపోకలు, రాత్రి వేళ భద్రతా చర్యలు తదితర అంశాలను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ముఖ్యంగా గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా రాత్రి వేళల్లో భక్తులు, యువత అధిక సంఖ్యలో సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
Ganesh Festival Security | అనవసర శబ్దాలు వద్దని హితవు..
అలాగే డీజేలు, అధిక శబ్దం, రోడ్లపై అనవసరంగా గుంపులు చేరడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ ప్రజలకు సూచించారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమాలు పూర్తయ్యే వరకు పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నగరంలోని పూలాంగ్, ఆర్ఆర్ చౌరస్తా, ఖిల్లా చౌరస్తా, బోధన్ బస్టాండ్, శ్రద్ధానంద్ గంజ్, దుబ్బ, అరుంధతి నగర్, సుభాష్ నగర్, చంద్రశేఖర్ కాలనీ, కంఠేశ్వర్, విద్యుత్ నగర్, గూపన్ పల్లి, ముబారక్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఖిల్లా రోడ్లో జరిగినటువంటి ద్విచక్ర వాహనాల రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైనటువంటి వాహనదారులను హుటాహుటిన ఆటోలో ప్రభుత్వ హాస్పటల్ తరలించడం జరిగింది.
ఇది కూడా చదవండి: ట్రోఫీ నిరాకరించిన భారత్.. కారణం ఇదే..!