అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Government Schools | కస్తూర్బా గాంధీ విద్యాలయాలతో పాటు జిల్లాలోని (Nizamabad) ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలలో అసంపూర్తి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు.
Government Schools | కేజీబీవీల్లో నూతన భవనాలు..
కేజీబీవి పాఠశాలల్లో నూతన భవన నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, డ్రైనేజీల నిర్మాణ ప్రగతిని సమీక్షిస్తూ, పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు మంజూరీలు లభించని పక్షంలో వీబీ జీరాంజీ కింద ప్రతిపాదనలు పంపాలని అన్నారు. ఎంఎస్‌వోలు, ఎంఈవోలు ప్రతీ నెలా కనీసం రెండు పర్యాయాలు కేజీబీవీలను ఆకస్మికంగా సందర్శిస్తూ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. బాలికలకు పరిశుభ్రమైన నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యాసంస్థల పరిసరాలు, ఆవరణ పరిశుభ్రంగా ఉండాలన్నారు. ముఖ గుర్తింపు విధానం (ఎఫ్ఆర్ఎస్) నూటికి నూరు శాతం అమలు చేయాలని, లేనిపక్షంలో జీతాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.
Government Schools | పారిశుధ్యం సరిగ్గా లేకపోతే ఎంఈవోలే బాధ్యులు..
అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా ఏదైనా విద్యాసంస్థల్లో అతిసారం, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదు అయితే సంబంధిత ఎంఈవోలే బాధ్యులని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణాల ప్రగతిని, నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలని ఆమె ఎంఈవోలను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇన్‌ఛార్జి జిల్లా విద్యా శాఖ అధికారి సాయాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: బ్యాగ్ చోరీకి యత్నం.. మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దుండగులు!