అక్షరటుడే, కామారెడ్డి/గాంధారి : ATM Robbery | గాంధారి మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన చోరీ ఘటన జిల్లా పోలీసు శాఖను కుదిపేసింది. ఈ కేసులో విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) సంబంధిత సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు.
ATM Robbery | నలుగురు హోంగార్డులు.. ఏఎస్సై, కానిస్టేబుల్
ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ.. ఏకంగా నలుగురు హోంగార్డులను సస్పెండ్ చేయడంతో పాటు, సదాశివనగర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్సై, ఏఆర్పీసీలకు ఛార్జిమెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం చోరీకి పాల్పడిన దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు.. చోరీ తర్వాత ఎక్కడికి వెళ్లారనే దానిపై ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి. కమర్షియల్ ఏరియాగా పేరున్న గాంధారి మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో భారీగా చోరీ జరగడం కలకలం రేపింది. ప్రతిరోజూ కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగే గాంధారి లాంటి కమర్షియల్ ప్రాంతంలో ఏకంగా రూ. 25 లక్షల వరకు చోరీ జరిగినట్లు భావిస్తుండడంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
ATM Robbery | సీసీ పుటేజీల ఆధారంగా..
ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారంగా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణను ముమ్మరం చేసినట్లు సమాచారం. జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో ఏటీఎం చోరీ జరగడం ఇదే మొదటిసారి కావడంతో ఈ ఘటన పోలీసు శాఖకు తీరని మచ్చగా మిగిలింది. దాని ఫలితంగానే విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో పోలీసు సిబ్బందిపై జిల్లా ఎస్పీ కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి పూట పెట్రోలింగ్ చేస్తూ ఆపరేషన్ కవచ్ విధుల్లో ఉండి కూడా ముగ్గురు దొంగలు స్కార్పియో వాహనంలో పోలీసుల కళ్లుగప్పి నిమిషాల వ్యవధిలో భారీ చోరీకి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నైట్ పెట్రోలింగ్ సరిగా జరగడం లేదని, ఫలితంగా చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయన్న ఆరోపణలకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.
ATM Robbery | అంతర్ రాష్ట్ర దొంగల పనేనా..?
అయితే ఏటీఎం చోరీకి పాల్పడిన దుండగులు అంతర్రాష్ట్ర దొంగలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముఖానికి మాస్కులు మాత్రమే ధరించే దొంగలు ఈసారి పంథా మార్చి మహిళలు వేసుకునే నైటీలతో చోరీకి పాల్పడటం కలకలం రేపింది. అలాగే పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఏటీఎం మిషన్పై స్ప్రే కొట్టి గ్యాస్ కట్టర్ ద్వారా ఏటీఎంను కొల్లగొట్టడం అంతర్ రాష్ట్ర ముఠా పనిగానే పోలీసులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Electricity Demand | ఎల్నినో ప్రభావంతో పెరిగిన విద్యుత్ డిమాండ్..