అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Greyhounds Land | హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలిలో ఐఎంజీ భూముల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఐఎంజీ సంస్థకు కేటాయించింది. అయితే ఆ భూమి ప్రభుత్వానికే చెందుతుందని కోర్టు తీర్పు చెప్పింది. ఈ వ్యవహారంపై తాజాగా హరీశ్‌రావు మాట్లాడారు.
ఐఎంజీ భూముల వ్యవహారంలో అసలు నేరస్తుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆ భూముల కోసం కోర్టులో పోరాడమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీర్పు వచ్చిందని, అంత మాత్రానా.. ఆ భూములు కాపాడింది రేవంత్‌రెడ్డి అవుతారా అని ప్రశ్నించారు. అంతేగాకుండా మంచిరేవులలో సైతం తాము భూములను కాపాడితే.. గ్రేహౌండ్స్ భూమిలో 10 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టిందని ఆరోపించారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 10 ఎకరాల 10 గుంటలు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. మహమ్మద్ అమీర్ సలావుద్దీన్ అనే వ్యక్తి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ అధినేత సంతోష్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రికి తెలియకుండా పోలీస్ శాఖకు చెందిన 10 ఎకరాలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని ఆయన ప్రశ్నించారు.
Greyhounds Land | అబద్ధాలు చెబుతున్న సీఎం
మియాపూర్ భూముల గురించి రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే అని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 95 సార్లు ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడంతో పాటు, జాగీర్ అబాలిషన్ యాక్ట్‌కు చట్టబద్ధత కల్పించడంతో మియాపూర్ భూములు ప్రభుత్వానికి దక్కాయని తెలిపారు. మియాపూర్ భూముల గురించి తెలుసుకుని సీఐడీ విచారణకు ఆదేశించి, అధికారులను తాము సస్పెండ్ చేశామని గుర్తు చేశారు.
దీనిని కూడా చదవండి : Nizamabad Couple Assault Arrest | దంపతులపై దాడిచేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్