India Manufacturing Growth | వ్యాక్సిన్ల నుంచి విమాన భాగాల తయారీ వరకు.. హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ సునామీ

ఒకప్పుడు భారతదేశపు ఫార్మా హబ్‌గా గుర్తింపు పొంది, ఆ తర్వాత ప్రపంచానికి వ్యాక్సిన్లను అందించిన 'వ్యాక్సిన్ రాజధాని'గా మారిన హైదరాబాద్ నగరం.. ఇప్పుడు తన రూపురేఖలను వేగంగా మార్చుకుంటోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: India Manufacturing Growth | ఒకప్పుడు భారతదేశపు ఫార్మా హబ్‌గా గుర్తింపు పొంది, ఆ తర్వాత ప్రపంచానికి వ్యాక్సిన్లను అందించిన ‘వ్యాక్సిన్ రాజధాని’గా మారిన హైదరాబాద్ నగరం.. ఇప్పుడు తన రూపురేఖలను వేగంగా మార్చుకుంటోంది. నేడు విమాన విడిభాగాలను, క్లౌడ్ సాంకేతికతకు అత్యంత కీలకమైన సర్వర్ ఫారమ్‌లను తయారు చేస్తూ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. నగరంలోని ఆదిభట్ల కేంద్రంగా గ్లోబల్ డిఫెన్స్ దిగ్గజాల కోసం ఏరోస్పేస్, విమాన నిర్మాణ పరికరాలు తయారవుతున్నాయి. మరోవైపు మిలియన్ల మందికి క్లౌడ్ సేవలు అందించే డేటా సెంటర్లు కొలువుదీరుతున్నాయి. డీఆర్‌డీవో (DRDO) పరిశోధనాశాలలు, ఏరోస్పేస్ ప్లాంట్లు, స్పేస్‌టెక్ సంస్థలు , ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు (PSUలు) నగరంలో వ్యూహాత్మక తయారీ రంగానికి బలమైన పునాదిగా నిలిచాయి.

India Manufacturing Growth | ఉత్పత్తి దిశగా భారత్ అడుగులు..

హైదరాబాద్‌లో  (  Hyderabad )కనిపిస్తున్న ఈ అద్భుత మార్పు తరహాలోనే ఇప్పుడు భారతదేశం కూడా తయారీ రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతోంది. వెల్దీవియా వెంచర్స్ ఎల్ఎల్‌పీ (Wealthyvia Ventures LLP) వ్యవస్థాపకుడు, సీఐఓ ప్రియతమ్ దేవ్‌స్కర్ ఈ అంశంపై మాట్లాడుతుండగా కీలక విషయాలు పంచుకున్నారు.

“గత మూడు దశాబ్దాలుగా భారత ఆర్థిక ప్రగతి అనేది మనం ఎంత వినియోగిస్తున్నామనే దానిపైనే ఆధారపడింది. కానీ రాబోయే దశాబ్దం మనం ఎంత ఉత్పత్తి చేయగలమనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు పునర్నిర్మితమవుతున్న వేళ, భారత్ కేవలం విడిభాగాలను అసెంబుల్ చేసే స్థాయి నుండి ఇంజనీరింగ్ స్థాయికి, కీలక విడిభాగాలను దిగుమతి చేసుకునే స్థితి నుండి సొంతంగా తయారు చేసే స్థాయికి ఎదుగుతోంది” అని ఆయన స్పష్టం చేశారు.

India Manufacturing Growth | పెట్టుబడిదారులకు అపార అవకాశాలు..

రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రత్యేక తయారీ సామర్థ్యం కలిగిన సంస్థలే మార్కెట్లో విజేతలుగా నిలుస్తాయని దేవ్‌స్కర్ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక, పారిశ్రామిక మార్పుల వల్ల రక్షణ , ఏరోస్పేస్, ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ , పీసీబీ రంగాలలో అపారమైన అవకాశాలు సృష్టి కానున్నాయి. వీటితో పాటు విద్యుత్ పరికరాలు, డేటా సెంటర్లు, ఫార్మా రంగానికి చెందిన సీడీఎమ్ఓ (CDMO) విభాగాలలోనూ రాబోయే కాలంలో అత్యంత వేగవంతమైన వృద్ధి, లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయని ఆయన విశ్లేషించారు.

India Manufacturing Growth  | డిఫెన్స్ ఇండెక్స్ ధమాకా..

జూన్ 2026 నాటికి ముగిసిన ఐదేళ్ల కాలంలో ‘నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్’ ఏటా 56% చక్రవడ్డీ రేటుతో ఊహించని రీతిలో వృద్ధి చెందింది. ఈ కాలంలో సాధారణ నిఫ్టీ 500 సూచీ 15% వృద్ధిని నమోదు చేయగా, డిఫెన్స్ ఇండెక్స్ పెట్టుబడిదారుల రూ. 1 లక్షను ఏకంగా రూ. 9 లక్షలుగా మార్చడం గమనార్హం.

ఈ వృద్ధి కేవలం ప్రారంభం మాత్రమేనని దేవ్‌స్కర్ అభిప్రాయపడ్డారు. ఐరోపాలో పెరిగిన విద్యుత్ , కార్మిక వ్యయాలు, చైనా ప్లస్ వన్ వ్యూహంలో భాగంగా అమెరికా తీసుకున్న నిర్ణయాలు, భారత్‌లోని ఇంజనీరింగ్ నైపుణ్యం , తక్కువ ఖర్చుతో కూడిన నమ్మకమైన భాగస్వామిగా భారత్‌కు ఉన్న మంచి పేరు దీనికి ప్రధాన కారణాలని వివరించారు. దీనికి ఉదాహరణగా.. 2025 మధ్య నాటికి అమెరికా దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్లలో భారత్‌లో తయారైనవి ఏకంగా 44 శాతానికి చేరాయి (గతంలో ఇది కేవలం 13% మాత్రమే).

India Manufacturing Growth | మల్టీబ్యాగర్లను గుర్తించడమే ..

విపణిలో స్పష్టమైన ఆధిపత్యం, అధిక లాభాల శాతాలు కలిగి ఉండి, అంతర్జాతీయ సంస్థలు దేనిపై ఆధారపడతాయో అలాంటి ప్రత్యేక రంగ నాయకత్వం (Niche Leaders) ఉన్న కంపెనీలలోనే అసలైన అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇటువంటి కంపెనీల ఆర్జన రాబోయే 4 నుండి 5 ఏళ్లలో ఏటా 30% కంటే ఎక్కువ వృద్ధి చెంది, మల్టీబ్యాగర్లుగా మారే అవకాశం ఉంది. భారతదేశ తదుపరి అవసరాలను తీర్చేందుకు నిశ్శబ్దంగా పనిచేస్తున్న వినూత్న కంపెనీల మార్కెట్ విలువ పెరగడానికి ముందే, ఆ ప్రారంభ దశలోనే వాటిని గుర్తించడమే పెట్టుబడిదారులు చేయవలసిన ముఖ్యమైన పని.

ఇది కూడా చదవండి: Mohan Bhagwat Speech | భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు.. ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి వేడుకల్లో భగవత్ హెచ్చరిక!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *