అక్షరటుడే, డిచ్పల్లి: Indiramma Houses | సీఎం రేవంత్ రెడ్డి (CM revanth reddy) సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తోందని రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. రూరల్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో 375 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
Indiramma Houses | ప్రతి పేద కుటుంబానికి ఇల్లు
ప్రతి పేద కుటుంబానికి సొంతంగా పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, గత పాలనలో పేదల అభివృద్ధిని విస్మరించారని ఎమ్మెల్యే విమర్శించారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహిళా సంఘాల ద్వారా అవసరమైన రుణ సదుపాయం కల్పించే చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.
Indiramma Houses | మహిళలకు తొలి ప్రాధాన్యత
మహిళలకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తోందని, అనేక సంక్షేమ కార్యక్రమాలను మహిళల పేరుతో అమలు చేస్తున్నామని భూపతిరెడ్డి పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని, ఇప్పటికే 80 శాతం ఇళ్ల నిర్మాణం సైతం పూర్తి చేసుకున్నారని.. మొదటి విడత కోటాలో మిగిలిన 375 మందికి పత్రాలు అందించినట్లు తెలిపారు. ఈ విడతలో అవకాశం దక్కని అర్హులైన వారికి రెండో విడతలో ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రెండో విడతలో మరో 2 వేల ఇళ్లు నియోజకవర్గానికి రానున్నాయని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా పక్కా ఇళ్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయరెడ్డి, బాలరాజు, భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, ఉమ్మాజి నరేష్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ‘వారణాసి’ షూటింగ్‌పై క్రేజీ అప్‌డేట్!