IPL Records | ఐపీఎల్‌లో రికార్డుల వర్షం.. గేల్ రికార్డ్ చెరిపేసిన సుద‌ర్శన్, కోహ్లీ అరుదైన మైలురాళ్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL Records | ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ విందును అందించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరు రికార్డుల వర్షంగా నిలిచింది. ఒకవైపు గుజరాత్ యువ బ్యాటర్ సాయి సుద‌ర్శ‌న్ (Sai Sudharsan) అద్భుత సెంచరీతో మెరిసిపోగా, మరోవైపు ఆర్‌సీబీ స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్ చరిత్రలో అరుదైన మైలురాళ్లు అందుకుని ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.

IPL Records | కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌..

ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తరఫున సాయి సుదర్శన్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 58 బంతుల్లోనే 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. పిచ్ నెమ్మదిగా ఉన్నా, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ జట్టుకు బలమైన స్కోరు అందించాడు. అతని శతకంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్‌తో సుదర్శన్ మరో అరుదైన ఘనతను తన పేరుపై నమోదు చేసుకున్నాడు. కేవలం 47 ఇన్నింగ్స్‌లలోనే 2000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్‌ (Chris Gayle) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

IPL Records

IPL Records | ఈ మ్యాచ్‌లో కోహ్లీ..

మ్యాచ్ అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ, తనపై తనకే ఉన్న అంచనాలు ఎక్కువగా ఉంటాయని, గత మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలు వచ్చినా వాటిని పెద్ద ఇన్నింగ్స్‌లుగా మార్చలేకపోయానని చెప్పాడు. ఈ సెంచరీ తనకు ఎంతో ప్రత్యేకమని, పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ ఇది బౌలర్లకు సవాల్‌గా మారే స్కోరని అభిప్రాయపడ్డాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ తరఫున విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ చూపించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ర‌బాడ‌ (Kagiso Rabada) బౌలింగ్‌లో బౌండరీ కొట్టి ఈ ఘనత సాధించాడు. ఫోర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, శిఖ‌ర్ ధావ‌న్, ద్రావిడ్, వార్న‌ర్,రోహిత్ శ‌ర్మ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఒకే ఫ్రాంచైజీ తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా కూడా కోహ్లీ మరో ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్నాడు. మొత్తానికి ఒకే మ్యాచ్‌లో ఇరు జట్ల స్టార్ ఆటగాళ్లు రికార్డులు సృష్టించడం అభిమానులకు డబుల్ ట్రీట్‌గా మారింది.

ఇది కూడా చదవండి..: Sachin Birthday | గిరిజన గ్రామంలో సాదాసీదాగా సచిన్ బర్త్‌డే.. పిల్లలతో ఆటలు, క్రీడా మైదానాల నిర్మాణానికి హామీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *