Kavitha New Party | తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. మరికాసేపట్లో పేరును ప్రకటించనున్న కవిత..

Srinivas Kolluri

అక్షరటుడే, హైదరాబాద్: Kavitha New Party | తెలంగాణ రాజకీయ తెరపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. దశాబ్ద కాలం పాటు ఉద్యమాన్ని నడిపి, తెలంగాణ కలను సాకారం చేసి, రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన తండ్రి నీడన, బీఆర్ఎస్ పార్టీలో కీలక శక్తిగా ఎదిగిన కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నేడు నూతన పార్టీని ఏర్పాటు చేయనున్నారు.

వివిధ కారణాలతో బీఆర్ఎస్ (BRS) నుంచి బయటకు వచ్చిన కవిత ఇప్పుడు సొంత పార్టీ (Kavitha New Party) ఏర్పాటు చేస్తున్నారు. తన రాజకీయ అస్తిత్వం కోసం ‘నూతన ప్రస్థానాన్ని’ ప్రారంభించబోతున్నారు. నేడు ఆమె కొత్త పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో, అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది. అసలు కవిత తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న వ్యూహమేంటి? ఆమె ముందున్న సవాళ్లను ఎలా ఎదర్కొంటారు? తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయనేది చూడాల్సిందే.

Kavitha New Party | మహిళల వెంట నిలబడాలని..

భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి సక్సెస్ అయిన మహిళా నేతలు చాలా తక్కువ. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో జయలలిత వంటి వారు పురుషాధిక్య రాజకీయాలను ఎదురించి నిలబడ్డారు. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడవాలని నిశ్చయించుకున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక ముద్ర వేసిన ఆమె, ఇప్పుడు రాజకీయ పార్టీ ద్వారా మహిళా పక్షపాతిగా నిలబడాలని భావిస్తున్నారు. అయితే, తెలంగాణ సమాజం ఆమెను ‘కేసీఆర్ కూతురు’గానే చూస్తుందా లేక ఒక స్వతంత్ర నాయకురాలిగా గుర్తిస్తుందా అన్నది వేచి చూడాలి.

Kavitha New Party | బీఆర్ఎస్ పునాదులే టార్గెట్..

కవిత కొత్త పార్టీకి ప్రధాన ప్రతిబంధకం సొంత కుటుంబం, బీఆర్ఎస్ పార్టీయేనని విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ (KCR) నాయకత్వంలోని బీఆర్ఎస్ నుంచి ఆమె విడిపోవడం వల్ల ఓట్ల చీలిక తప్పదు. ముఖ్యంగా కవిత వర్గంగా ముద్రపడిన నేతలు, కేడర్ ఇప్పుడు డైలమాలో పడ్డారు. ఒకవేళ ఆమె పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమైతే, అది బీఆర్ఎస్ పునాదులనే దెబ్బతీసే అవకాశం ఉంది. దీంతో అటు అన్న కేటీఆర్ (KTR), ఇటు బావ హరీష్ రావు (Harish Rao)ల నుంచి ఆమె తీవ్రమైన రాజకీయ పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Kavitha New Party | పార్టీని బి-టీమ్‌గా చూపేందుకు..

రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ‘బి-టీమ్’ ముద్ర వేయడం ఒక వ్యూహం. కవిత పార్టీని కాంగ్రెస్‌కు అనుబంధంగా లేదా బి-టీమ్‌గా చూపేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నించవచ్చు. ఇది ప్రజల్లోకి వెళ్తే ఆమె స్వతంత్ర అస్తిత్వానికి దెబ్బ తగులుతుంది. ఇక చేరికల విషయానికొస్తే.. బీఆర్ఎస్‌లో టిక్కెట్లు దక్కని వారు, అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను తనవైపు తిప్పుకోవడం ఆమెకు కీలకం.

ఢిల్లీ లిక్కర్ కేసు..

కవిత రాజకీయ ప్రయాణంలో ‘ఢిల్లీ లిక్కర్ కేసు’ (Delhi Liquor Case) అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసు కారణంగా ఆమె జైలుకు వెళ్లడం, ఈడీ విచారణలు ఎదుర్కోవడం వంటివి ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయి. ఈ అవినీతి ముద్రను చెరిపేసుకుని, ‘తెలంగాణ బిడ్డ’గా ప్రజల నమ్మకాన్ని గెలవడం ఆమె ముందున్న అతిపెద్ద సవాలు. అయితే ఇటీవల సుప్రీంలో ఆమెకు ఊరట లభించింది. ఇది ఆమె కొంత కలిసివచ్చే పరిణామంగా చెప్పుకోవచ్చు.

స్థానిక సంస్థల ఎన్నికలు..

కవిత రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో 2029 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయి. హైదరాబాద్ నగరంపై కవితకు కొంత పట్టు ఉంది. ఇక్కడ ఆమె పార్టీ ప్రభావం చూపితే, నగర రాజకీయాల్లో ఆమె కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ కనీస స్థానాలు గెలుచుకుంటే కేడర్‌లో మరింత భరోసా పెరుగుతుంది.

కల్వకుంట్ల కవిత తీసుకున్న ఈ నిర్ణయం ఒక సాహసోపేతమైన ముందడుగుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు కేసుల భయం, మరోవైపు ఇంటి నుంచే వ్యతిరేకత, ప్రత్యర్థుల విమర్శలు.. వీటన్నింటినీ తట్టుకుని ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఒక ధ్రువతారగా వెలుగుతారా లేదా అన్నది రాబోయే రోజుల్లో ఆమె తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా, ఆమె పార్టీ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఒక నూతన సమీకరణానికి నాంది కాబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..: April 25 Gold Rates | పెళ్లిళ్ల సీజన్‌లో గుడ్ న్యూస్ .. ప‌డిపోతున్న బంగారం ధర.. కొనుగోలుదారులకు ఊరట!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *