అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy ATM Robbery Case | గాంధారి ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అంతర్రాష్ట్ర ఏటీఎం చోరీ ముఠా గుట్టురట్టు చేసి రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు.
Kamareddy ATM Robbery Case | గాంధారి మండల కేంద్రంలో..
జిల్లా పోలీసు కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) సోమవారం మీడియాకు వివరించారు. ఈనెల 10 న అర్ధరాత్రి సమయంలో గాంధారి గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నైటీలు ధరించి గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు. నగదుతో ఉన్న ఐదు బాక్సులను అపహరించారు. ఈ ఘటనలో మొత్తం రూ.25,45,900 నగదు చోరీకి గురైనట్టుగా బ్యాంకు ప్రతినిధి ఫిర్యాదు చేయగా గాంధారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Kamareddy ATM Robbery Case | కరీంనగర్లోనూ !
సెప్టెంబర్ 2026లో కరీంనగర్‌లోని రెండు ఎస్బీఐ ఏటీఎంల వద్ద కూడా ఇదే ముఠా గ్యాస్ కట్టర్‌తో చోరీలకు పాల్పడినట్టుగా తేలింది. ఈనెల 10న రాత్రి నిందితులు మరోసారి తెలంగాణకు వచ్చి గాంధారికి వచ్చే మార్గంలో ఒక వెల్డింగ్ షాప్ తాళం పగలగొట్టి సిలిండర్‌తో పాటు నేరానికి ఉపయోగపడే పరికరాలను దొంగిలించారు. అనంతరం ఏటీఎం వద్దకు చేరుకుని మాస్కులు, క్యాప్‌లు, నైటీలు ధరించి, సీసీ టీవీ కెమరాలపై బ్లాక్ స్ప్రే వాడి గ్యాస్ కట్టర్ తో ఏటీఎంను ధ్వంసం చేశారు. నగదును స్కార్పియోలో వేసుకుని పరారయ్యారు. చోరీ అనంతరం నిందితులు మహారాష్ట్ర, రాజస్థాన్ వైపు వెళ్తున్నట్టుగా గుర్తించిన కామారెడ్డి పోలీసులు సంబంధిత రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. రాజస్థాన్‌లోని చేచాట్ పోలీసులు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా టైరు దెబ్బతినడంతో నిందితులు వాహనాన్ని వదిలిపెట్టి నగదు బ్యాగుతో పరారయ్యారు.
Kamareddy ATM Robbery Case | లో ప్రత్యేక బృందాలతో..
ప్రత్యేక బృందాలు రాజస్థాన్ చేరుకుని ఈ నేక 20న సాయంత్రం సమయంలో బరోడామేవ్ సమీపంలో భరత్పూర్ రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్న రాజస్థాన్‌కు చెందిన రషీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.29,400, మొబైల్ ఫోన్లు 2, చోరీకి వాడిన స్కార్పియో వాహనం, గ్యాస్ కట్టింగ్ పరికరాలు, వివిధ నంబర్లు గల నంబర్ ప్లేట్లు, మాస్కులు, 3 ఇనుప కత్తులు, 1 ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నారు. రషీద్‌ను కోర్టులో పరుపరుస్తామని పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, పుష్పరాజ్‌తో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Gambling Raid | పేకాట స్థావరంపై పోలీసుల దాడి..