అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad TGPSC Exams | టీజీపీఎస్సీ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశంతో సోమవారం వీసీలో మాట్లాడారు.
Nizamabad TGPSC Exams | 24, 26 తేదీల్లో…
కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్టు (అనలిస్ట్), అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ పోస్టుల భర్తీ కోసం ఈనెల 24, 26 తేదీలలో పరీక్షలు జరుగనున్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో గల ఏవీ ఎంటర్ ప్రైజెస్ సెంటర్లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 24న అసిస్టెంట్ సైంటిస్టు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాన్నం 12.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.00 వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయన్నారు. 26వ తేదీన కూడా అవే సమయాల్లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Nizamabad TGPSC Exams | కాపీయింగ్, లీకేజీలకు ఆస్కారం లేకుండా..
జిల్లాలో 24వ తేదీ నాటి పరీక్షకు 90 మంది అభ్యర్థులు, 26వ తేదీ నాటి పరీక్షకు 190 మంది హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు. కాపీయింగ్, లీకేజీలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు అనుక్షణం నిశిత పర్యవేక్షణ జరుపుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. బయో మెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉదయం పరీక్షకు సంబంధించి ఉదయం 8.00 గంటల నుండే పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని, 9.30 గంటలకు గేట్లు మూసివేస్తారని, నిమిషం ఆలస్యం అయినా అనుమతించబడరని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ట్రైనీ కలెక్టర్ సురేష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: వాహనాలకు నిమ్మ-మిరప దండ ఎందుకు కడతారు?