Kamareddy BRS | కేసీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి..: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

రాజీనామా చేయాల్సింది కేసీఆర్ కాదని, హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BRS | రాజీనామా చేయాల్సింది కేసీఆర్ కాదని, వెయ్యి రోజులలో హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Ex MLA Gampa Govardhan) డిమాండ్ చేశారు. పాలనలో కాంగ్రెస్​ విఫలమైందని కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

Kamareddy BRS | 420 హామీలను పేర్కొంటూ 420 ఫీట్ల ఫ్లెక్సీలు..

ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ముద్రించిన 420 ఫీట్ల ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు గోవిందా అంటూ పాటలు పాడి నిరసన వ్యక్తం చేశారు. గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర రాష్ట్రాల సీఎంలను తీసుకొచ్చి ఆరు గ్యారెంటీల పేరుతో 420 హామీలు ఇచ్చారని, ఇవన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. 100 రోజులు కాదు 1000 రోజులైనా హామీలు అమలు చేయలేదు కాబట్టే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారని విమర్శించారు. రైతులు, పేద ప్రజలు, ఇతర వర్గాలకు మేలు జరిగింది కేసీఆర్ హయాంలోనేనని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని, ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.

Kamareddy BRS | కాంగ్రెస్​ సర్పంచ్​లు సైతం..

కాంగ్రెస్ సర్పంచులు సైతం యూరియా కోసం రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటలు కేసీఆర్ కరెంట్ ఇస్తే ఈ ప్రభుత్వం 10 గంటలు కూడా ఇవ్వడం లేదని, నీరు పారక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోదాముల్లో యూరియా ఉన్నప్పటికీ యాప్ ఓపెన్ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క రైతు కూడా యూరియా కోసం ఇబ్బంది పడలేదని తెలిపారు. దోచుకున్న డబ్బుతో ఢిల్లీలో కప్పం కడుతున్నారని, మూడేళ్లలో 70 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమీ లేదని విమర్శించారు.

Kamareddy BRS | ఇంటింటికీ బాకీ కార్డులు

పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గలేదని, న్యాయబద్ధంగా, శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మైకులు కూడా పెట్టుకునే హక్కు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత అణిచివేస్తే అంత ఎత్తుకు వెళ్తామన్నారు. ప్రతి ఇంటికి బాకీ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. గురువారం యూరియా గురించి, రైతు సమస్యలపై దోమకొండ పెద్దమ్మ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. శుక్రవారం బీబీపేటలో మహిళల సమస్యలపై వంటావార్పు, 5వ తేదీన కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో విద్యార్థులతో ధర్నా, 6వ తేదీన ప్రతి గ్రామంలో పడకేసిన పారిశుధ్యంపై నల్ల బ్యాడ్జీలతో నిరసన, 7వ తేదీన మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో 420 హామీలపై లైనులో నిలబడి ప్రజావాణిలో ఫిర్యాదు చేసి నిరసన తెలుపుతామని, 8వ తేదీన అంబేద్కర్ కు వినతిపత్రం అందజేస్తామని ఆయన వెల్లడించారు. అనంతరం 38 వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ బాకి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దీన్, మున్సిపల్ వైస్ ఛైర్​పర్సన్​ కాసర్ల గోదావరి స్వామి, మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *