అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Council | మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న బీజేపీ కౌన్సిలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం అదనపు కలెక్టర్ ఎన్వై గిరికి వినతిపత్రం అందజేశారు.
Kamareddy Municipal Council | సమావేశాలకు అడ్డు పడుతున్నారు
ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. బీజేపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశాలు సజావుగా సాగనివ్వడం లేదన్నారు. ప్రజారోగ్యం, మౌలిక వసతులు, పారిశుధ్యం వంటి ముఖ్య అంశాలపై చర్చ జరగాల్సిన సమావేశాలు బీజేపీ కౌన్సిలర్ల అనుచిత ప్రవర్తనతో అస్తవ్యస్తంగా మారుతున్నాయని ఆరోపించారు. సమావేశాల్లో దొంగ ఎజెండా అంటూ అసభ్య పదజాలం వాడుతున్నారని, దుర్భాషలాడుతూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ చట్టం, నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రవర్తిస్తున్నారని, దీనివల్ల అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై సరైన చర్చ జరగడం లేదని తెలిపారు.
తెలంగాణ పురపాలక చట్టాన్ని గౌరవించకుండా కౌన్సిలర్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని, సభ ఆస్తులను, అధికారిక పత్రాలను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. పాలనాపరంగా కూడా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమావేశాల వీడియో రికార్డులను పరిశీలించి తప్పు చేసిన కౌన్సిలర్లపై చట్ట ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ సమావేశాలు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Kamareddy Municipal Council | రెగ్యులర్ సానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఇవ్వండి
కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality)లో రెగ్యులర్ సానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో పారిశుధ్య పనులు స్తంభించాయని, వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అదనపు కలెక్టర్‌ను కోరారు. మున్సిపాలిటీలో డోర్-టు-డోర్ చెత్త సేకరణ, పబ్లిక్ శానిటేషన్ నిర్వహణ, సిబ్బంది పర్యవేక్షణ, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం, ప్రజారోగ్య చర్యల అమలులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. సాంకేతిక, పర్యవేక్షణ సిబ్బంది లేకపోవడంతో పారిశుధ్య ప్రమాణాలు పాటించడం కష్టంగా మారిందని, దీనిపై ప్రజల నుండి ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది కష్టపడుతున్నప్పటికీ సరైన పర్యవేక్షణ లేక పనులు సక్రమంగా జరగడం లేదని ఉమారాణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా వెంటనే తగిన సానిటరీ ఇన్స్పెక్టర్లను కామారెడ్డి మున్సిపాలిటీకి పోస్ట్ చేయాలని లేదా డిప్యూటేషన్ పై పంపాలని ఆమె కోరారు.
ఇది కూడా చదవండి..: Kalyana Lakshmi Fraud | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లలో బయటపడ్డ అక్రమాలు.. వైద్యుడి సంతకం ఫోర్జరీ