అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipality | వరుస వివాదాలు, అవినీతి ఆరోపణలు, వసూళ్ల పర్వంతో కామారెడ్డి(Kamareddy) బల్దియా అభాసుపాలవుతోంది. పాలకవర్గం నూతనంగా ఏర్పడినప్పటి నుంచి బల్దియాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా వచ్చిన పాలకవర్గం కేవలం 8 నెలల పాలనలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది.
Kamareddy Municipality | తీవ్రమైన ఆరోపణలు..
మున్సిపాలిటీ పరిధిలో వసూళ్ల పర్వంపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్న క్రమంలో ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే వసూళ్ల ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగా తాజాగా ఎమ్మెల్యే హెచ్చరికలతోనైనా బల్దియా తీరులో మార్పు వస్తుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కామారెడ్డి బల్దియాలో ఇప్పుడు కమిటీలే చక్రం తిప్పుతున్నాయి. పాలన కోసం కాదు, పనులు చక్కబెట్టడం కోసం కాదు, కేవలం వసూళ్లు, సెటిల్మెంట్ల కోసమే ఒక్కో పనికి ఒక్కో కమిటీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు అనే వ్యవస్థ ఉన్నా, దానిని పక్కన పెట్టి మరీ కమిటీల పేరుతో అధికారాన్ని కొందరి చేతుల్లో కేంద్రీకరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Kamareddy Municipality | గత పాలకవర్గం నుంచే మొదలు
ఈ కమిటీల సంస్కృతి ఇప్పుడు పుట్టింది కాదు. గత పాలకవర్గం హయాంలోనే మొదలైందన్న ప్రచారం సాగుతోంది. అప్పుడు చిన్నగా మొదలైన ఈ విధానం ఇప్పుడు పెద్ద వృక్షంలా మారింది. గతంలో ఏదో ఒక పని కోసం వేసిన కమిటీ, ఇప్పుడు ప్రతి పనికి, ప్రతి బిల్లుకు, ప్రతి లైసెన్స్‌కు, ప్రతి నిర్మాణానికి అడ్డుపడుతోందని వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
Kamareddy Municipality | వసూళ్ల కోసమే ప్రత్యేక ఏర్పాట్లు
బల్దియాలో ఏ పని కావాలన్నా కమిటీని దాటి వెళ్లలేని పరిస్థితి. ఫైలు కదలాలంటే కమిటీ సభ్యుల ఆమోదం కావాలి, బిల్లు పాస్ కావాలంటే కమిటీ కనుసన్నల్లో నడవాలి. దీంతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలన పేరుతో సాగుతున్న ఈ వసూళ్ల పర్వంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఒకప్పుడు 5 మందితో మొదలైన కమిటీ, 9 మందికి ఆ తర్వాత ఇప్పుడు 12 మందికి చేరింది. సంఖ్య పెరిగిన కొద్దీ వసూళ్ల భారం కూడా పెరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో ఏరియా, ఒక్కో విభాగం అప్పగించి, ఎవరి పరిధిలో వారు వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో బల్దియా కార్యాలయం చుట్టూ దళారుల హడావిడి పెరిగిపోయింది.
సమావేశంలో రచ్చరచ్చ..
బుధవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. 13న నిర్వహించిన సమావేశం ఆందోళనల మధ్య బుధవారానికి వాయిదా పడగా బుధవారం సైతం ఎమ్మెల్యే సమక్షంలోనే కౌన్సిలర్లు నువ్వానేనా అన్నట్టుగా వాదులాడుకున్నారు. బల్దియా అధికారుల తీరు, ప్రైవేట్ వ్యక్తుల నియామకం, వసూళ్లు, అక్రమాలపై తీవ్ర స్థాయిలో చర్చ సాగింది. వీటిపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకపై ఇలాంటి భాగోతాలు జరగకూడదని హెచ్చరించారు. ఇదే తీరు కొనసాగితే అధికారులు వెళ్లిపోవచ్చని అల్టిమేటం జారీ చేశారు.
ఎమ్మెల్యే హెచ్చరికలతో సెట్టయ్యేనా..?
వరుస ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, బల్దియాకు చెడ్డ పేరు తెస్తే చర్యలు తప్పవని ఆయన గట్టిగా హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడుతున్న వారి వివరాలు బహిర్గతం చేస్తానని పేర్కొన్నారు. ఇకపై తన క్యాంప్ కార్యాలయం చుట్టూ అధికారులు తిరగడం తప్పదన్నారు. దాంతో ఎమ్మెల్యే హెచ్చరికలతోనైనా కమిటీల బల్దియా తీరు మారుతుందా, లేక హెచ్చరికలు కూడా మొక్కుబడిగానే మిగిలిపోతాయా అన్నది ఇప్పుడు కామారెడ్డిలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి : ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు ఊరట కలిగించే వార్త.