Kamareddy Open Plots | వెంచర్లలో ‘ఓపెన్​ స్థలాల’ దందా.. పట్టించుకోని బల్దియా

వెంచర్​లలో మున్సిపాలిటీకి కేటాయించిన 10 శాతం స్థలాన్ని కొందరు ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Open Plots | ఓ స్థలాన్ని వెంచర్​గా మార్చాలంటే సవాలక్ష నిబంధనలు అడ్డువస్తాయి. రెవెన్యూ స్థలాన్ని వెంచర్​గా మార్చిన తర్వాత మున్సిపాలిటీ అప్రూవల్ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మున్సిపాలిటీకి వెంచర్ చేసిన మొత్తానికి 10 శాతం స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఈ పదిశాతం స్థలం అందుబాటులోనే ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలో గడిచిన పదేళ్లలో విచ్చలవిడిగా వెంచర్లు వెలిశాయి. పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో వెలిసిన వెంచర్లలో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వెంచర్లలో మున్సిపాలిటీ కోసం వదిలిన స్థలాలు భద్రమేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Kamareddy Open Plots | బై నంబర్లతో రిజిస్ట్రేషన్లు..?

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వెంచర్లలో పార్కు కోసం వదిలిన 10 శాతం స్థలాన్ని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారా అనే అనుమానాలు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినా, వాటికే బై నంబర్లు ఇస్తూ అమాయక ప్రజలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీకి చెందిన స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తూ, కొన్ని చోట్ల ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈ పార్కు స్థలాలకు అనుమతులు ఎలా వస్తున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Kamareddy Open Plots | వెంచర్లలో సాగుతున్న భాగోతం..

వెంచర్ వేసే సమయంలో మ్యాప్​లో పార్కు, ఓపెన్ స్పేస్ చూపించి అప్రూవల్ తీసుకున్న తర్వాత, క్షేత్రస్థాయిలో ఆ స్థలాలను కబ్జా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని వెంచర్లలో పార్కు స్థలంలోనే షెడ్లు, ఇళ్లు నిర్మించడం, మరికొన్ని చోట్ల ప్లాట్లుగా విభజించి విక్రయించడం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం తనిఖీలు చేయకపోవడం, ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందనే ప్రచారం సాగుతోంది.

Kamareddy Open Plots | ఇంటి నిర్మాణంతో అనుమానాలు

ఇటీవల పట్టణంలోని ఓ వార్డులో మున్సిపాలిటీ అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సంబంధిత స్థలం కూడా మున్సిపాలిటీకి సంబంధించిన ఓపెన్ స్థలమని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. ఈ స్థలం ఇంటి నిర్మాణం చేపడుతున్న యజమానికి రిజిస్ట్రేషన్ కావడంతో ఆ స్థలం తనదేనని యజమాని చెప్తున్నాడు. అయితే ఇదే స్థలానికి బై నంబర్ ఇచ్చి ఇంటి యజమానికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బై నంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిన మాట నిజమని తేలితే సంబంధిత వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ అంశంతో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెంచర్లలో 10శాతం స్థలం మున్సిపాలిటీ పరిధిలోనే ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Sardar Vallabhbhai Patel | జాతీయ ఐక్యతకు కృషి చేసిన మహానుభావుడు వల్లభ్ భాయ్ పటేల్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *