అక్షరటుడే, కామారెడ్డి: Oil Palm Farming | రైతులు ఆదాయాన్ని పెంచుకునేందుకు వరి వంటి సంప్రదాయ పంటలతో పాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామింగ్పై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) సూచించారు. మాటలు కాదు చేతలు అంటూ జిల్లాలోని తన 12 ఎకరాల వరి పొలంలో వరి సాగు నిలిపివేసి ఆయిల్ ఫామ్ మొక్కలను నాటి రైతులకు ఆదర్శంగా నిలిచారు.
Oil Palm Farming | ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ..
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. భూగర్భ జలాల పరిరక్షణ, నీటి వినియోగం తగ్గింపు, రైతుల ఆదాయం పెంపునకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలకు భవిష్యత్తులో మంచి మార్కెట్ ఉంటుందని, స్థిరమైన ఆదాయం లభిస్తుందని వివరించారు. వరి సాగులో సాగునీరు, ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నీటిని ఆదా చేసే పంటల సాగు అనివార్యమని, ఆయిల్ పామ్ ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు.
Oil Palm Farming | ఒకే పంటలపై ఆధారపడకుండా..
రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యం పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు శాస్త్రీయ సలహాలు ఇస్తూ ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ప్రోత్సాహకాలు, సాంకేతిక సహకారం అందిస్తోందని షబ్బీర్ అలీ తెలిపారు. రైతుల్లో విశ్వాసం పెంచేందుకే ముందుగా తన క్షేత్రంలో పంట మార్పు చేపట్టానని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆయిల్ ఫామ్ వైపు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Collectorate Vehicle Checks | కలెక్టరేట్లో పోలీసుల విస్తృత తనిఖీలు