అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Rain | పట్టణంతో పాటు పాటు జిల్లా వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి అలుముకున్న నల్లని మేఘాల నేపథ్యంలో దాదాపు అరగంట పాటు ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
Kamareddy Rain | వర్షంతో పంటలకు ఉపశమనం..
గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఎండిపోతున్న పంటలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలు వేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షంతో పొలాలకు నీళ్లు అందనున్నాయి. మళ్లీ దుక్కి దున్నుకునే అవకాశం లభించింది. భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉండటంతో బోర్లపై ఆధారపడిన రైతుల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. భారీ వర్షం రైతులకు లాభం చేకూర్చినా, కామారెడ్డి (Kamareddy) పట్టణ ప్రజలకు మాత్రం చుక్కలు చూపించింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్ స్టాండ్, గాంధీ చౌక్, రాజీవ్ రహదారి వద్ద భారీగా నీరు నిలిచింది. డ్రైనేజీలు పొంగడంతో మురికి నీరు రోడ్లపైకి వచ్చింది. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్టుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..: Panchayat Audit | అడ్డగోలుగా ‘ఆడిట్’.. ప్రజాధనానికి రక్షణ కరువు..