అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Saddula Bathukamma | కామారెడ్డిలో (Kamareddy) ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మతో ముగిశాయి. 9 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Kamareddy Saddula Bathukamma | ఉదయం నుంచి బతుకమ్మల తయారీలో బిజీబిజీగా..
ఉదయం నుంచి బతుకమ్మలను తయారు చేయడం నుంచి మొదలుకుని చెరువులు, కుంటలలో నిమజ్జనం చేసే వరకు మహిళలంతా బతుకమ్మ సంబరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆదివారం సద్దుల బతుకమ్మ సందర్భంగా గ్రామాలు, పట్టణాలు బతుకమ్మ ఆట పాటలతో మారుమోగాయి.
బతుకమ్మ తయారీలో కళాకారులు తమ ప్రతిభను కనబర్చారు. వివిధ రూపాల్లో బతుకమ్మలను తయారు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. తంగెడు, గునుగు, బంతి, చామంతి, కట్ల, సీతజడ వంటి రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు కనువిందు చేశాయి. కొందరు బతుకమ్మను గౌరమ్మ రూపంలో, మరికొందరు ఆలయం, రథం రూపాల్లో తయారుచేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
Kamareddy Saddula Bathukamma | చిన్నాపెద్దా అంతా సంబరంగా..
సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా, హోదాలతో సంబంధం లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్త వస్త్రాలు ధరించిన మహిళలు, యువతులు, చిన్నారులు వలయంగా నిలబడి చప్పట్లు కొడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ ఆడి పాడారు.
రాత్రి చెరువులు, కుంటలలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. గౌరమ్మ బొట్టుతో మహిళలు ఒకరికొకరు వాయినం ఇచ్చుకున్నారు. కొన్ని గ్రామాల్లో చెరువులు, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలాల్లో అక్కడే ఫలహారం, భోజనం చేసి ఉత్సవాలను ముగించారు.
బతుకమ్మ ఉత్సవాలు కేవలం పండుగ మాత్రమే కాదని, తెలంగాణ మహిళల ఐక్యత, ప్రకృతి పట్ల గౌరవం, సామూహిక సంతోషాన్ని ప్రతిబింబిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ ఒకే ఉత్సాహంతో పేద ధనిక తారతమ్యం లేకుండా ఈ పండుగను జరుపుకున్నారని, 9 రోజులు గ్రామమంతా పూల వాసనతో, పాటల సందడితో నిండిపోయిందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: నమ్మితే నట్టేట ముంచేస్తారు..!సైబర్ నేరగాళ్ల నయా ఎత్తుగడలు