అక్షరటుడే, నిజామాబాద్ సిటీ/భీమ్గల్ : Water Supply Priority | ఎల్నినో ప్రభావంతో (El Nino Impact) జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి(P Sudarshan Reddy) వెల్లడించారు. భీమ్గల్(Bheemgal) తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
Water Supply Priority | రైతులకు పలు సూచనలు..
రైతులకు సుదర్శన్ రెడ్డి పలు సూచనలు చేశారు. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు సైతం గణనీయంగా పడిపోతున్నాయని, మున్ముందు పంటల సాగుకు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఖరీఫ్ సీజన్లో సమృద్ధిగా సాగు జలాలు అందించామని, పూర్తిస్థాయిలో కరెంటు సరఫరా చేసి పంటలను కాపాడుకున్నామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఎల్నినో వల్ల తీవ్ర విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నందున, అందుబాటులో ఉన్న నీటి వనరులను పూర్తిగా తాగునీటి అవసరాల కోసమే వినియోగించాల్సిన ఆవశ్యకత నెలకొనిందని తెలిపారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత యాసంగిలో వరి పంట వేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. వరి వేసుకుంటే సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున తక్కువ నీటితో సాగయ్యే కూరగాయలు, పప్పు దినుసు పంటల వైపు దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, భీమ్గల్ మున్సిపల్ ఛైర్పర్సన్ నాగమణి, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తహశీల్దార్ కిరణ్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, స్థానిక రైతులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: అమెరికాలో ఫాస్ట్ రోప్ ప్రదర్శనలో ప్రమాదం..