అక్షరటుడే, వెబ్డెస్క్: Kuppam Election Clash | చిత్తూరు Chittur జిల్లా కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ తీవ్ర విషాదానికి, రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.
కుప్పం మండలం వానగుట్టపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద సర్పంచ్ ఎన్నికల ఫలితాల ప్రకటన సమయంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది. ఉద్రిక్తతల నడుమ ఎన్నికల రూట్ అధికారి వాహనం వేగంగా దూసుకెళ్లడంతో రాజేంద్ర (60) అనే వ్యక్తి మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Kuppam Election Clash | కౌంటింగ్ కేంద్రం వద్ద రణరంగం!
వానగుట్టపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత, విజేతకు డిక్లరేషన్ (గెలుపు ధృవీకరణ పత్రం) ఇచ్చే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. క్షణాల్లోనే అది తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆ సమయంలో అక్కడున్న ఎన్నికల రూట్ ఆఫీసర్ (RO) వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి గుంపుపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో వాహనం దాదాపు 10 మందిని ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లింది. ప్రమాద తీవ్రతకు రాజేంద్ర అనే వ్యక్తి వాహనం కింద చిక్కుకుని, సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లబడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Kuppam Election Clash | వైసీపీ వర్సెస్ టీడీపీ పరస్పర ఆరోపణలు!
ఈ విషాద ఘటనపై కుప్పం రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి..
వైసీపీ వర్గం వాదన: వానగుట్టపల్లిలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారని, అయితే ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు అధికారులను డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు ఎన్నికల రూట్ ఆఫీసర్ వాహనంపై దాడి చేయడంతో, భయంతో డ్రైవర్ వాహనాన్ని వేగంగా పోనిచ్చారని.. ఆ క్రమంలో తమ పార్టీ కార్యకర్త రాజేంద్రను కిలోమీటరున్నర దూరం ఈడ్చుకెళ్లి చంపేశారని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
టీడీపీ వర్గం వాదన: మరోవైపు, ఈ ఘటనకు వైసీపీ నేతల దౌర్జన్యమే కారణమని టీడీపీ వర్గాలు ఎదురుదాడికి దిగాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ నాయకులే ఆర్ఓ (RO) వాహనంపై దాడికి పాల్పడ్డారని, ఆ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పిన కారు దూసుకెళ్లడంతో తమ పార్టీ కార్యకర్త రాజేంద్ర ప్రాణాలు కోల్పోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Kuppam Election Clash | గ్రామంలో పోలీసుల మోహరింపు..
ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు. ఒకే వ్యక్తిని ఇరుపార్టీలు తమ కార్యకర్తగా పేర్కొంటూ నిరసనలకు దిగడంతో వానగుట్టపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎన్నికల వాహనంపై దాడి, రాజేంద్ర మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ మరియు ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేపట్టారు.