Passenger Saves 73 Lives | రెప్పపాటు కాలంలో పెను విషాదం జరిగే ప్రమాదం నుంచి 73 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నడుస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో అదుపుతప్పిన బస్సును, ఓ ప్రయాణికుడు కండక్టర్‌తో కలిసి అత్యంత చాకచక్యంగా నిలిపివేసి అందరి ప్రాణాలను కాపాడారు. హనుమకొండ-హైదరాబాద్ మార్గంలో చోటుచేసుకున్న ఈ సాహసోపేత ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Passenger Saves 73 Lives | క్షణాల్లో మారిన పరిస్థితి!
హనుమకొండ నుంచి గురువారం మధ్యాహ్నం 2.25 గంటలకు 73 మంది ప్రయాణికులతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సు కాజీపేటలోని బాపూజీనగర్ చౌరస్తా దాటిన వెంటనే, డ్రైవర్ రాజుకు ఒక్కసారిగా మూర్ఛ (Fits) వచ్చింది. దీంతో ఆయన చేతులు పట్టుతప్పి స్టీరింగ్ ఒకవైపునకు తిరిగిపోయింది. అదుపుతప్పి దూసుకెళ్తున్న బస్సును చూసి ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.
Passenger Saves 73 Lives | కండక్టర్, ప్రయాణికుడి సమయస్ఫూర్తి..
ప్రమాదాన్ని పసిగట్టిన కండక్టర్ విజయ్ వెంటనే డ్రైవర్ సీటు వద్దకు పరుగెత్తి బస్సును ఆపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న జనగామకు చెందిన రామకోటి అనే వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు.
కండక్టర్ విజయ్‌తో కలిసి అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్ రాజును పక్కకు జరిపారు. రామకోటి వెంటనే స్టీరింగ్‌ను అదుపులోకి తీసుకుని, బ్రేకులు వేసి బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన నిలిపివేశారు.
బస్సు ఆగిపోవడంతో అందులోని 73 మంది ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే, బస్సు అదుపుతప్పిన క్రమంలో రోడ్డు పక్కన నిల్చున్న ఆగమ్మ అనే వృద్ధురాలితో పాటు మరో మహిళకు బస్సు స్వల్పంగా తగలడంతో వారికి గాయాలయ్యాయి.
Passenger Saves 73 Lives | రంగంలోకి కాజీపేట ఏసీపీ.. మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు!
అదే సమయంలో అటుగా వెళ్తున్న కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. అస్వస్థతకు గురైన డ్రైవర్ రాజును, గాయపడిన వృద్ధురాలిని తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. 73 మంది ప్రాణాలను కాపాడిన రియల్ హీరోలు రామకోటి, కండక్టర్ విజయ్‌లను ఏసీపీ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ సాహసోపేత ఘటన గురించి తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వెంటనే రామకోటికి ఫోన్ చేసి మాట్లాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎన్నో కుటుంబాలను ఆదుకున్న రామకోటి, కండక్టర్ విజయ్‌లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..