Shabbir Ali Audio | కాంగ్రెస్​లో ఏం జరుగుతోంది.. ‘షబ్బీర్​ అలీ’ ఆడియో వెనక ఉన్నదెవరు?

కామారెడ్డి కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి : Shabbir Ali Audio | కామారెడ్డి కాంగ్రెస్ (Kamareddy Congress) రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, కీలక శాఖలకు మంత్రిగా చేసి ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ అలీని టార్గెట్ చేస్తూ జరుగుతున్న పరిణామాలు పార్టీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. మహిళలపై చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్యలు, పార్టీ పదవుల విషయంలో డబ్బుల ప్రస్తావన తెస్తూ ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందనే అనుమానాలను షబ్బీర్ అలీతో పాటు ఆయన వర్గం బలంగా నమ్ముతోంది.

షబ్బీర్ అలీ ఓ కార్యకర్తతో మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే అది పూర్తిగా ఫేక్ అని, తన గొంతును మిమిక్రీ చేసి కుట్రపూరితంగా సృష్టించారని షబ్బీర్ అలీ స్వయంగా ఖండించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయితీకి మారుపేరుగా నిలిచానని, ఇలాంటి నీచపు ఎత్తుగడలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Shabbir Ali Audio | తీవ్ర చర్చ..

అంచలంచెలుగా ఎదిగి ఢిల్లీ స్థాయిలో పేరు సంపాదించిన షబ్బీర్ అలీ (Shabbir Ali) లాంటి కీలక నేతపై ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా అసలు ఆ ఆడియో నిజమేనా..? ఒకవేళ నిజం కాకపోతే దానిని బయటకు ఎవరు వైరల్ చేశారు..? దీని వెనుక ఉన్నదెవరు అనే చర్చ పొలిటికల్ వర్గాల్లో కొనసాగుతోంది. తెరవెనుక ఉంటూ షబ్బీర్ ఆలీపై కుట్ర చేసేంత సాహసం ఎవరు చేస్తున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Shabbir Ali Audio | పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వివాదం

Shabbir Ali Audio

ఈ ఆడియో వ్యవహారం జిల్లా రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. వైరల్ అయిన కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని షబ్బీర్ అలీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరోవైపు ప్రత్యర్థి వర్గం కూడా పోటాపోటీగా ఫిర్యాదులు ఇవ్వడంతో కామారెడ్డి కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయంలో ముఖ్య నాయకులు పడ్డారు.

Shabbir Ali Audio | పార్టీ పెద్దల నిర్ణయంపై ఉత్కంఠ

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కామారెడ్డి లాంటి కీలక నియోజకవర్గంలో ఇలాంటి వివాదాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. సీనియర్ నేతపై జరుగుతున్న దుష్ప్రచారానికి పార్టీ అధిష్ఠానం ఎలా పుల్‌స్టాప్ పెడుతుందోనని కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షబ్బీర్ అలీకి అండగా నిలిచి, కుట్రదారులను బయటకు లాగుతారా లేక వివాదం మరింత ముదరనిస్తారా అనేది వేచి చూడాలి. ఆడియో విషయంలో ఫోరెన్సిక్ టెస్టుకు పంపాలని వస్తున్న డిమాండ్ నేపథ్యంలో నిజానిజాలు తేల్చి, పార్టీ ప్రతిష్ఠను కాపాడే బాధ్యత అధిష్ఠానంపైనే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు ముఖ్య నేతల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం పార్టీకి అంత మంచిది కాదని పొలిటికల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Railway Track Death | రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *