అక్షరటుడే, భీమ్‌గల్: Meat Shop Hygiene | పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పట్టణంలోని చికెన్, మటన్, ఇతర మాంసం విక్రయ కేంద్రాల యజమానులకు మున్సిపల్ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. వర్షాకాలంలో దుకాణదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ నోటీసుల ద్వారా స్పష్టం చేశారు.
Meat Shop Hygiene | నాణ్యత లేకుంటే ఉపేక్షించం
మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner) గజానంద్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున, మాంసం దుకాణాల యజమానులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. వినియోగదారులకు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, నాణ్యమైన మాంసాన్ని మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. విక్రయించే మాంసంపై ఈగలు, దోమలు, ఇతర క్రిమికీటకాలు వాలకుండా ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. దుకాణాల పరిసరాల్లో పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
Meat Shop Hygiene | ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం..

పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు వ్యాపారులు సహకరించాలని కమిషనర్ కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించి, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయాలు జరిపితే.. తెలంగాణ పురపాలక చట్టం ప్రకారం సదరు యజమానులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్, అధికారులు ఓంకార్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Urea Slot Booking | మీ-సేవ కేంద్రాల ద్వారా కూడా యూరియా బుకింగ్ : కలెక్టర్ ఇలా త్రిపాఠి