అక్షరటుడే, డిచ్పల్లి: Migrant Workers Welfare | విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రవాసులు, వలస కార్మికుల సంక్షేమానికి (NRIs Welfare Policy) మరింత పటిష్టమైన విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి (MLA Bhupati Reddy) అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
Migrant Workers Welfare | ఫిలిప్పీన్స్ ప్రభుత్వం..
ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తమ దేశ పౌరుల కోసం అమలు చేస్తున్న వలస సంక్షేమ విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణలోనూ అనుసరించే దిశగా చర్యలు చేపడుతున్నామని భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే పీసీసీ అధ్యక్షుడి నేతృత్వంలో ఎన్నారై పాలసీ తీసుకురావడంతో పాటు గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భూపతి రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నారై అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేసిందని, రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి వినోద్ కుమార్ ఛైర్మన్‌గా, మంద భీంరెడ్డి వైస్ ఛైర్మన్‌గా, విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు తాను, మరో 11 మంది నిపుణులతో కమిటీ పనిచేస్తోందని వివరించారు.
Migrant Workers Welfare | ఎన్నారైల సంక్షేమానికి..
ఎన్నారై సంక్షేమానికి అవసరమైన చర్యలపై అధ్యయనం చేసేందుకు గత మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిన కమిటీ, ఆగస్టు 17 నుంచి 21 వరకు ఫిలిప్పీన్స్‌లో పర్యటించిందని రూరల్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్‌కు గల్ఫ్ దేశాలతో సంబంధం ఏమిటని కొందరు ప్రశ్నించినప్పటికీ, ఆ దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఇతర దేశాలకు వలస వెళ్తున్నందున, వారి సంక్షేమం కోసం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పరిశీలించడమే పర్యటన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఫిలిప్పీన్స్‌లో స్కిల్డ్, నాన్-స్కిల్డ్ రంగాల్లో పెద్ద సంఖ్యలో వలసదారులు ఉన్నారన్నారు.
Migrant Workers Welfare | మూడు దశల్లో వలసదారులకు రక్షణ
ఫిలిప్పీన్స్ మోడల్‌లో విదేశాలకు వెళ్లే వారికి మూడు దశల్లో రక్షణ కల్పిస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. ఎంబసీలలో లీగల్ అడ్వైజరీ సెల్‌లు ఏర్పాటు చేయడం, అనివార్య కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి పునరావాసం కల్పించడం, తిరిగి ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి విధానాలు కూడా ఫిలిప్పీన్స్‌లో ఉన్నాయని తెలిపారు.
యువతకు నైపుణ్యాలు.. ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే అన్నారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని తెలిపారు. విదేశాలకు వెళ్లే యువతకు వివిధ భాషల్లో నైపుణ్య శిక్షణ అందించే దిశగా కూడా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఫిలిప్పీన్స్ పర్యటనకు సంబంధించిన సమగ్ర నివేదికను త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని తెలిపారు. సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగారెడ్డి, అంబర్ సింగ్, చింతల కిషన్, మోహన్, హన్మండ్లు, జలందర్ రెడ్డి, రాంచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: స్మార్ట్ మీటర్లతో పేదలపై భారం