అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Community Kitchen | జిల్లాలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. ఈ మేరకు మంగళవారం నవీపేట్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ గిడ్డంగిని కలెక్టర్ ఇలా త్రిపాఠితో (Collector Ila Tripathi) కలిసి పరిశీలించారు.
Nizamabad Community Kitchen | హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు ప్రభుత్వ భాగస్వామ్యంతో హరే కృష్ణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కిచెన్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మార్కెట్ గిడ్డంగిని పరిశీలించామని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు గిడ్డంగి భవనం అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించామన్నారు. సుమారు 70వేల మంది విద్యార్థులకు దీని ద్వారా అల్పాహారం అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Nizamabad Community Kitchen | ఆకలితో తరగతి గదులకు రాకుండా..
విద్యార్థులు ఉదయం ఆకలితో తరగతి గదులకు రాకుండా.. వారికి నాణ్యమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రవేశపెట్టారని సుదర్శన్‌రెడ్డి గుర్తుచేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇడ్లీ, దోశ, పూరీ, బోండా, సాంబార్ తయారు చేసే మిషన్లు ఏర్పాటు చేయనున్నారని, ఇక్కడి నుండే ఆయా ప్రభుత్వ బడులు, కళాశాలలకు అల్పాహారం సరఫరా అవుతుందని సుదర్శన్‌రెడ్డి వివరించారు. పాత్రలు శుభ్రం చేసే మిషన్లు, పాల కేంద్రం, ఆహార పదార్థాల టెస్టింగ్ ల్యాబ్, కూరగాయలు కట్ చేసే మిషన్లు, కూరగాయలు కడిగే మిషన్లు, చట్నీ పౌడర్ తయారీ యంత్రాలను వినియోగిస్తూ పరిశుభ్రమైన నాణ్యతతో కూడిన అల్పాహారం అందిస్తారని అన్నారు. వేలసంఖ్యలో విద్యార్థులకు ఒకే విధమైన నాణ్యతతో, పరిశుభ్రమైన అల్పాహారం అందించడమే కేంద్రీకృత వంటశాలల ఉద్దేశమని తెలిపారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని సెంట్రలైజ్డ్ కిచెన్ కోసం అవసరమైన విద్యుత్, నీటి వసతి, రోడ్డు సౌకర్యం వంటి అన్ని సదుపాయాలను సత్వరమే సమకూర్చాలని కలెక్టర్‌కు ఆదేశించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీవో రాజేంద్ర కుమార్, డీఆర్డీవో సాయన్న, ట్రాన్స్‌కో ఎస్ఈ రాజేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రాకేష్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు శేఖర్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, తహశీల్దార్ వెంకటరమణ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ పెడితే.. QR కోడ్ పంపి రూ.2.60 లక్షలు స్వాహా!