అక్షరటుడే, వెబ్‌డెస్క్: Parliament Protest Clash | ఢిల్లీలో సీజేపీ నిరసనలతో ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంట్ ముట్టడికి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున నిరసనకారులు జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వచ్చారు.
జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసులు మోహరించారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన నిరసనకారులపై లాఠీఛార్జీ చేశారు. అనంతరం ఆందోళనకారులు పార్లమెంట్ వైపు ర్యాలీగా బయలుదేరారు. అనుమతి నిరాకరించినప్పటికీ ఆందోళనకారులు బారీకేడ్లను దాటుకొని పార్లమెంట్ వైపు వస్తుండటంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులు పరుగులు తీశారు.
Parliament Protest Clash | పలువురికి గాయాలు

నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ‘చలో సంసద్’ పాదయాత్ర కోసం జంతర్ మంతర్ నిరసన స్థలం వద్దకు చేరిన యువతను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలు కూడా ఉపయోగించారు. పార్లమెంటు వైపు పాదయాత్ర చేస్తూ బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో కొందరు నిరసనకారులు, పోలీసు సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. జంతర్ మంతర్ వద్ద నిర్దేశించిన నిరసన ప్రదేశంలో ముందస్తు అనుమతితో తప్ప, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మందితో నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు, నిరసనలు, సమావేశాలు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి అని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులను ఆంక్షలను లెక్క చేయకుండా నిరసనకారులు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Parliament Protest Clash | మెట్రోస్టేషన్ల మూసివేత
భద్రతా కారణాల దృష్ట్యా రాజీవ్ చౌక్, జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. దీంతో గందరగోళం నెలకొంది. వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. పలువురు గమ్యస్థానాలకు చేరుకొవడానికి చాలా సేపు నిరీక్షించారు. ఇతర మార్గాల ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
ఇది కూడా చదవండి..: Tripura DGP Death | త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ అనుమానాస్పద మృతి