అక్షరటుడే, లింగంపేట: Pocharam Reservoir | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో Kamareddy జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. జలాశయంలో నీటిమట్టం 20 అడుగులకు చేరుకోవడంతో మంజీర పరీవాహక ప్రాంతాల ప్రజలు, రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
Pocharam Reservoir | గతేడాది భయానక పరిస్థితులు..
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు పోచారం ప్రాజెక్టులోకి చేరుతుండటంతో జలాశయం పూర్తిగా నిండిపోయిందని ఆయన తెలిపారు. నీటి ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే ప్రమాదకర పరిస్థితులు అవకాశం ఉందని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Lingampet Floods | కుంభవృష్టి..ఉప్పొంగిన వాగులు..లింగంపేట–కామారెడ్డి మధ్య స్తంభించిన రాకపోకలు!
గతేడాది భారీ వర్షాల సమయంలో పోచారం జలాశయం కట్ట తెగి, మంజీర నది ఉద్ధృతంగా ప్రవహించి పలు గ్రామాల వద్ద లోతట్టు ప్రాంతాలు జలమయమైన సంగతి తెలిసిందే. వ్యవసాయ భూములు నీటమునిగిపోవడంతో పాటు రాకపోకలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Pocharam Reservoir | నది ప్రవాహానికి దూరంగా ఉండాలి
మంజీర పరీవాహక ప్రాంత రైతులు, ప్రజలు నది ఒడ్డునకు వెళ్లకుండా ఉండాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ప్రవాహాలను దాటే ప్రయత్నాలు చేయవద్దని అధికారులు హెచ్చరించారు. పరిస్థితిని నీటిపారుదల శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, అవసరమైతే మరిన్ని హెచ్చరికలు జారీ చేస్తామని తెలిపారు.
వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో పోచారం జలాశయ పరిసర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండగా, ప్రజలు కూడా అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.