Podu Land | పోడు భూమిలో చెట్లు నాటిన అధికారులు.. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

పోడు భూమి కాపాడుకోవడానికి 15రోజులుగా అధికారుల చుట్టూ తిరిగి వేడుకున్నా ఫలితం లేకపోయింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Podu Land | పోడు భూమి కాపాడుకోవడానికి 15రోజులుగా అధికారుల చుట్టూ తిరిగి వేడుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు కళ్ల ముందే తమ పంటను నాశనం చేసి చెట్లు నాటుతుంటే తట్టుకోలేక ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన రాజంపేట మండలం (Rajampet Mandal) షేర్ శంకర్ తండాలో మంగళవారం చోటుచేసుకుంది.

Podu Land | షేర్​ శంకర్​ తండాలో..

తండాకు చెందిన సరోజా కుటుంబం ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిలో ఈ నెల ప్రారంభం నుంచి అటవీశాఖ అధికారులు చెట్లు నాటేందుకు వస్తున్నారు. దీంతో పంట పూర్తిగా ధ్వంసమైందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇది తమ పాత పోడు భూమి అని, ప్రభుత్వ ఆన్‌లైన్ రికార్డుల్లో తమ పేరు ఉందని, హక్కు పత్రాలు మాత్రమే రావాల్సి ఉందని ఆమె చెప్పింది. హక్కు పత్రాలు రాకుండా అడ్డుపడుతున్నది కూడా అటవీశాఖ అధికారులేనని ఆరోపించింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్​ను కలిసి మొరపెట్టుకుంది. డీఎఫ్‌ఓ కార్యాలయం చుట్టూ కూడా తిరిగింది. తమ పొట్ట కొట్టొద్దు, మాకు వేరే దిక్కు లేదు అని బతిమాలినా అధికారులు పట్టించుకోలేదు. మంగళవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున సిబ్బందితో వచ్చిన ఫారెస్ట్ అధికారులు సరోజా భూమిలో చెట్లు నాటడం ప్రారంభించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సరోజను, స్థానికులను పక్కకు నెట్టేశారు.

Podu Land  | వేడుకున్నా అధికారులు కనికనించలేదని..

ఎంత వేడుకున్నా అధికారులు కనికరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సరోజా పురుగుల మందు తాగింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో తండాలో ఉద్రిక్తత నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది. ఇదేం న్యాయం..? కనీస మానవత్వం కూడా లేదా అని గిరిజనులు ప్రశ్నించారు. బాధ్యులైన ఫారెస్ట్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. సరోజాకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని, ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత అటవీశాఖ అధికారులదేనని తండా నాయకులు విఠల్ నాయక్, గులిబాయి, సరియా నాయక్ అన్నారు. ఈ విషయమై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మనోజ్​ను ఫోన్ ద్వారా సంప్రదించగా సదరు భూమి అటవీశాఖకు సంబంధించినదన్నారు. అందులోనే తాము చెట్లు నాటామని తెలిపారు. పురుగుల మందు తాగి ఎవరు ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Rain | కామారెడ్డిలో భారీ వర్షం.. రైతుల్లో ఆనందం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *