అక్షరటుడే, కామారెడ్డి: Police Martyrs Day | విధి నిర్వహణలో పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పోలీస్ కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్తూపం వద్ద ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి నివాళులర్పించారు.
Police Martyrs Day | విధి నిర్వహణలో ప్రాణత్యాగం..
కలెక్టర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల స్ఫూర్తి, విలువలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలిపారు. సమాజ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందాలంటే శాంతిభద్రతలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు, దేశ అంతర్గత భద్రతలో పోలీసులు తమ అమూల్యమైన ప్రాణాలను సైతం త్యాగం చేస్తూ ప్రజల రక్షణకు అంకితమవుతున్నారని తెలిపారు. అటువంటి మహనీయులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని అన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారు భవిష్యత్తులో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ఏవైనా సమస్యలు ఉంటే ఏ సమయంలోనైనా తనను వచ్చి కలవవచ్చని, వెంటనే వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
Police Martyrs Day | రాష్ట్రం కోసం విధి నిర్వహణలో..
ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ దేశం కోసం, రాష్ట్రం కోసం విధి నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకునే రోజు అక్టోబర్ 21 అని తెలిపారు. ఆ మహనీయుల జ్ఞాపకార్థం ప్రతి ఏడాది పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. జవానులు, పోలీసులు విధి నిర్వహణలో కర్తవ్యానికి ప్రాధాన్యమిస్తూ దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అసాంఘిక శక్తులను ఎదుర్కొంటూ 154 మంది పోలీసు సిబ్బంది వీరమరణం పొందగా, తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు అమరులయ్యారని తెలిపారు. కామారెడ్డి జిల్లా నుంచి ఇప్పటివరకు ఏడుగురు పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీలు మధుసూదన్, విఠల్ రెడ్డి, శ్రీనివాసరావు, గట్టుమల్లు, ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Police Martyrs Day | పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి : కలెక్టర్, సీపీ