అక్షరటుడే వెబ్డెస్క్: RTC Workers PRC | ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అన్ని హామీలను నెరవేరుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) స్పష్టం చేశారు. వాస్తవాలను వక్రీకరిస్తూ కొందరు కార్మిక సంఘాల నాయకులు ప్రజలను, కార్మికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
RTC Workers PRC | అందరి ఆమోదంతోనే ఏకగ్రీవ నిర్ణయాలు..
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు , సుమారు 30 మంది కార్మిక సంఘాల ప్రతినిధులతో 14 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపామని మంత్రి గుర్తు చేశారు. అందరి ఆమోదంతోనే ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
RTC Workers PRC | డిమాండ్ల పరిష్కారం..
మొత్తం 32 డిమాండ్లలో 29 యాజమాన్య పరిధిలో, 3 ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు గుర్తించామన్నారు. యాజమాన్య పరిధిలోని అంశాలను ఈడిల కమిటీ ద్వారా పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన 11 శాతం పీఆర్సీని జులై నెల జీతాల నుంచే అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీన ప్రక్రియలో భాగంగా అధికారుల కమిటీలో కార్మిక ప్రతినిధులు ఉండాలని నిర్ణయించామని, ఆ ప్రతినిధులు గుర్తింపు పొందిన సంఘం నుండే ఉండాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించామని మంత్రి వివరించారు.

RTC Workers PRC | ఏపీ తరహా ఇబ్బందులు రాకూడదనే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం తర్వాత తలెత్తిన సమస్యలు తెలంగాణలో రాకూడదనే ఉద్దేశంతోనే, ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి, ఆ ప్రతినిధుల సమక్షంలోనే విలీన విధివిధానాలను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇందుకోసం లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను నోడల్ అధికారిగా నియమించి, ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. కార్మికుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని మంత్రి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. మాట మీద నిలబడే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో నెరవేరుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి: VIP Security Reduction | ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీఐపీల సెక్యూరిటీ తగ్గింపు