Rupee Value Fall | క్రూడ్ ఆయిల్ కుతకుత.. రూపాయి విలవిల

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rupee Value Fall | రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు భారీగా పెరగడంతోపాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరిస్తుండడంతో డాలర్‌తో మన కరెన్సీ విలువ పడిపోతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6 శాతం తగ్గిన రూపాయి.. ఐదేళ్లలో దాదాపు 30 శాతం క్షీణించడం గమనార్హం.

శుక్రవారం ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 96.15 కు పడిపోయి మరోసారి జీవనకాల కనిష్టాన్ని నమోదు చేసింది. చివరలో కాస్త కోలుకుని 95.96 వద్ద స్థిరపడింది. ఓవైపు ఇండియా ఇంపోర్ట్ బిల్లు పెరగడం, మరోవైపు ఫారిన్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో మన కరెన్సీపై ఒత్తిడి ఎక్కువైంది. ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటున్నా రూపాయి పతనం ఆగడం లేదు.

Rupee Value Fall | ఎఫ్ఐఐల అమ్మకాల ప్రభావం..

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic Stock Market)పై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారు పెట్టుబడులు పెడితే మార్కెట్ పెరగడం, అమ్మకాలకు పాల్పడితే తగ్గడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే మన మార్కెట్లకన్నా ఇతర దేశాల మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వారికి లాభదాయకంగా కనిపిస్తుండడంతో కొన్నేళ్లుగా ఇక్కడ పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉన్నారు. 2021 నుంచి ఏటా వారు నికర అమ్మకందారులుగానే నిలుస్తున్నారు.

2021లో రూ. 92,729 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించిన ఎఫ్ఐఐలు.. 2022లో మరింత జోరు పెంచి రూ. 2.78 లక్షల కోట్లను వెనక్కి తీసుకువెళ్లారు. 2023లో కాస్త తగ్గినా రూ. 16,510 కోట్ల షేర్లు అమ్మేశారు. 2024 నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జోరు పెంచారు. 2024లో రూ. 3.02 లక్షల కోట్లు, 2025లో రూ. 3.06 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటికే రూ. 2.65 లక్షల కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం. ఎఫ్ఐఐలు భారీగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడంతో రూపాయి తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.

Rupee Value Fall | మరింత దెబ్బతీసిన క్రూడాయిల్..

అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా సరుకుల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడి క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. దాదాపు రెండున్నర నెలలుగా బ్యారెల్ ధర వంద డాలర్లపైనే కొనసాగుతుండడంతో దిగుమతి ఖర్చులు పెరిగాయి. అంతర్జాతీయ చెల్లింపులు ఎక్కువగా డాలర్లలో జరుగుతాయి కాబట్టి డిమాండ్ ఏర్పడి రూపాయి విలువ మరింత క్షీణిస్తోంది.

Rupee Value Fall | ప్రధాని పిలుపునకు కారణమదే..

మనదేశం ఇంధనం, బంగారం దిగుమతులకే ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పడుతోంది. ఈ నేపథ్యంలో దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల పొదుపు చేయాలంటూ పిలుపునిచ్చారు. ఏడాదిపాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని, వంట నూనె వినియోగాన్ని తగ్గించాలని, ఇంధనాన్ని ఆదా చేయాలని, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మారాలని, స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను 15 శాతానికి పెంచింది. పెట్రోల్ , డీజిల్ ధరలను లీటర్ కు రూ. 3 చొప్పున పెంచారు. బంగారం, క్రూడాయిల్, వంట నూనెల దిగుమతులు 10 శాతం తగ్గినా 45 బిలియన్ డాలర్ల వరకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: NEET Paper Leak | నీట్​ పేపర్​ లీకేజీలో కీలక నిందితుడి అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *