Sajjanar Exam Message | ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి.. మార్కులు జీవితాన్ని శాసించలేవు.. డీజీ సజ్జనార్​

Naresh Chandan
Sajjanar Exam Message

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sajjanar Exam Message | ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోవాలని.. మార్కులు జీవితాన్ని శాసించలేవని డీజీ సజ్జనార్​ పేర్కొన్నారు. నేడు (బుధవారం, ఏప్రిల్​ 29) పదో తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు సూచనలు చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్​లో డీజీ సజ్జనార్​ పోస్ట్​ పెట్టారు.

Sajjanar Exam Message | ఉపాధ్యాయులకు విన్నపం

పదో తరగతి ప‌రీక్షా ఫలితాల నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విన్నపం చేశారు. ఈ ఫలితాలు జీవిత గమనాన్ని శాసించేవి కావని, మీ సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని గుర్తించాలని సూచించారు.

Sajjanar Exam Message | ఏమన్నారంటే..

“ఇటీవలి ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత కొన్ని నిండు ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మార్కులు తక్కువ వచ్చాయని లేదా విఫలమయ్యామని ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు, అది మీ కుటుంబాలకు తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తుంది.

ఓటమి అనేది గెలుపునకు తొలిమెట్టు కావాలే తప్ప, జీవితానికి ముగింపు కాకూడదని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక మనవి… మీ ఆశలను, అంచనాలను పిల్లలపై భారంగా మోపి వారిని ఒత్తిడికి గురిచేయకండి. ఫలితం ఏదైనా సరే, పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోండి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి.

మార్కుల కంటే పిల్లల ప్రాణం, వారి చిరునవ్వు అత్యంత ముఖ్యం. ఫలితాల తర్వాత పిల్లల ప్రవర్తనను నిశితంగా గమనించండి; వారు ఒంటరిగా ఉన్నా, మౌనంగా ఉన్నా వారి వెన్నంటి ఉండి ధైర్యం చెప్పండి. అవసరమైతే మీ పనులన్నీ పక్కన పెట్టి, ఒక రోజంతా వారితో గడిపి, వారి మనసులోని భయాన్ని పోగొట్టండి.

ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో విద్యార్థులతో సంభాషించి, ఫెయిల్యూర్ అనేది తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయని భరోసా కల్పించాలి.

చదువులో వెనుకబడిన ఎందరో వ్యక్తులు పట్టుదలతో శ్రమించి నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థాయికి చేరుకున్నారన్న నిజాన్ని ఎవరూ మరువవద్దు. పరీక్షల కంటే ప్రాణం గొప్పది, మీ వెనుక ఒక కుటుంబం ఉందని, మీ కోసం వారు తపిస్తున్నారని ఆలోచించండి.

ఏ చిన్న ఆందోళన కలిగినా తల్లిదండ్రులతో లేదా ఆత్మీయులతో పంచుకోండి. ప్రతికూల ఫలితాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

Giridarshak Recruitment Telangana | మావోయిస్టుల నిర్మూలనకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. గిరిదర్శకుల నియామకం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *