అక్షరటుడే వెబ్‌డెస్క్: SBI Recruitment 2026 | దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 11,000 నుంచి 12,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ సి.ఎస్. శెట్టి వెల్లడించారు. అలాగే దేశవ్యాప్తంగా బ్రాంచ్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
SBI Recruitment 2026 | 12 వేల ఉద్యోగాల భర్తీ..
ఉద్యోగుల రిటైర్‌మెంట్లు, బ్యాంకు అవసరాలు, భవిష్యత్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు చేపట్టనున్నట్లు చైర్మన్ తెలిపారు. అవసరాలను బట్టి ఈ సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండవచ్చని, అయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దాదాపు 12 వేల వరకు భర్తీ జరిగే అవకాశం ఉందని చెప్పారు. గతేడాది ఎస్‌బీఐ భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకోగా.. అందులో 1,500 మంది ఐటీ నిపుణులు కూడా ఉన్నారు. అయితే ఈ ఏడాది ఐటీ విభాగంలో గతేడాది స్థాయిలో పెద్ద ఎత్తున నియామకాలు అవసరం లేదని స్పష్టం చేశారు. మార్చి నాటికి ఎస్‌బీఐలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలకు పైగా ఉంది. గతేడాది ఒక్క సంవత్సరంలోనే బ్యాంకు మొత్తం 25,633 మందిని నియమించుకుంది.
SBI Recruitment 2026 | 250 వరకు కొత్త బ్రాంచ్‌లు..
ఉద్యోగ నియామకాలతో పాటు బ్రాంచ్ నెట్‌వర్క్‌ను పెంచేందుకు కూడా బ్యాంకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా కొత్తగా 200 నుంచి 250 బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు సి.ఎస్. శెట్టి తెలిపారు. కొత్త కాలనీలు ఏర్పడుతున్న ప్రాంతాలు, వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. కొన్ని బ్రాంచ్‌లను అవసరానికి తగ్గట్టుగా మారుస్తున్నప్పటికీ.. నికరంగా ప్రతి ఏటా 200 నుంచి 250 కొత్త బ్రాంచ్‌లు అదనంగా వస్తాయని అంచనా వేస్తున్నారు.
SBI Recruitment 2026 | వాటా విక్రయంపై కీలక అడుగు..
ప్రస్తుతం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ఎస్‌బీఐకి దాదాపు 3.23 శాతం, దాని అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు 4.33 శాతం వాటా ఉన్నాయి. మరోవైపు, సుమారు రూ.30,000 కోట్ల భారీ అంచనా విలువతో ఐపీవో (IPO) తెచ్చేందుకు ఎన్‌ఎస్‌ఈకి ఇటీవలే నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పబ్లిక్ ఇష్యూ మార్కెట్లో ప్రవేశిస్తే దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించనుంది. ఇప్పటివరకు ఈ జాబితాలో 2024లో రూ.27,858.75 కోట్లతో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఎల్ఐసీ (రూ.20,557.23 కోట్లు), పేటీఎం (రూ.18,300 కోట్లు), టాటా క్యాపిటల్ (రూ.15,511.87 కోట్లు), కోల్ ఇండియా (రూ.15,200 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇది కూడా చదవండి: Sridhar Babu Comments | కేసీఆర్ వైఖరి మారకపోతే మరో పదేళ్లు రోడ్లపైనే బీఆర్ఎస్: మంత్రి శ్రీధర్ బాబు