అక్షరటుడే, వెబ్డెస్క్: SIR Process Protest | దేశంలో ఓటు చోరీ జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా సోమవారం హైదరాబాద్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ తీరు ఉందని విమర్శించారు. మోదీ అమిత్ షా తీరుతో ప్రపంచ దేశాలు ముక్కున వేలు వేసుకుంటున్నాయన్నారు.
దేశంలో ఓట్ల చోరీతో బీజేపీ గెలుస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) అన్నారు. కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎన్నికల కమిషన్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం ఎన్నికల అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. దేశంలో ఓటర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ వల్ల బీహార్లో ఆర్జేడీ, బెంగాల్లో టీఎంసీ ఓడిపోయాయని ఆరోపించారు. ఎలక్షన్ కమిషనర్ తీరుతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందన్నారు. ఎలక్షన్ కమిషనర్ బీజేపీకి తొత్తుగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
SIR Process Protest | ప్రజాస్వామ్య పరిరక్షణకు..
దేశంలో కొన్నేళ్లుగా ‘ఓట్ల చోరీ’ జరుగుతోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే చేసిన హెచ్చరికలు నేడు నిజమని తేలిపోయాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పునరంకితమై ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసించే రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలపాలని, రాజ్యాంగంపై నమ్మకం లేని వారు మాత్రమే ఈ ఉద్యమానికి దూరంగా ఉంటున్నారని విమర్శించారు. ప్రతీ పౌరుడికీ వారి ఓటు హక్కు దక్కేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Telangana Local Status | తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు