Sirnapalli Cheruvu | జలసిరితో మెరిసిన ‘సిర్నాపల్లి’.. పరవళ్లు తొక్కుతున్న అలుగు అందాలు

ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి చెరువు అలుగెల్లడంతో పర్యాటక శోభను సంతరించుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Sirnapalli Cheruvu | చుట్టూ దట్టమైన అడవి.. మధ్యలో పెద్ద చెరువు.. విశాలమైన అలుగు.. దాని పైనుంచి పారే తెల్లటి నీళ్లతో జారువారే అందాలు.. ఇలా సిర్నాపల్లి అలుగు అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే.. ఇందల్వాయి (indalwai) మండలంలోని సిర్నాపల్లి చెరువు అలుగెల్లడంతో పర్యాటక శోభను సంతరించుకుంది.

Sirnapalli Cheruvu | ఇందూరుకే ప్రత్యేకం.. ‘సిర్నాపల్లి’

జిల్లాలోనే (Nizamabad ) అత్యంత ప్రాచుర్యం పొందిన ఇందల్వాయి మండలం సిర్నాపల్లి చెరువు అలుగెల్లడంతో పూర్వవైభవం సంతరించుకుంది. ఇటీవల కురుస్తున్న విస్తారమైన వర్షాలకు సిర్నాపల్లి చెరువు నిండి, విశాలమైన అలుగుపై నుంచి నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి.

Sirnapalli Cheruvu | చారిత్రక నేపథ్యం.. జానకీబాయి దూరదృష్టి

సహజసిద్ధమైన దట్టమైన అటవీప్రాంతం మధ్యలో విస్తరించి ఉన్న ఈ చెరువుకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అప్పట్లో సంస్థానాధీశురాలు శీలం జానకీ బాయి ప్రజల తాగు, సాగునీటి అవసరాల కోసం ఎంతో దూరదృష్టితో ఈ చెరువును నిర్మించారు. మిగతా చెరువులతో పోలిస్తే ఇది అత్యంత ఎత్తైన ప్రాంతంలో రూపుదిద్దుకుంది. ఎటు చూసినా కొండలు-కోనల మధ్య విస్తరించి ఉండటం దీని ప్రత్యేకత. ప్రస్తుతం అలుగు పారుతుండటంతో ఆ జలదృశ్యాలు కన్నుల పండువగా మారాయి. గ్రామీణ ప్రాంత రైతాంగం, ప్రజలు జలసిరిని చూసి ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు.

Sirnapalli Cheruvu | పర్యటకుల సందడి

సిర్నాపల్లి అడవి ప్రాంతంలో పెద్ద విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు వర్షాకాలంలో రూపం మార్చుకుని అద్భుతమైన జలపాతాన్ని తలపిస్తుంది. ఎంతో ఎత్తు నుంచి ఉరికే అలుగు నీటి ధారలు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. చెరువు నిండి అలుగు పారుతోందన్న విషయం తెలియగానే జిల్లా నలుమూలల నుంచి పర్యటకులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఉప్పొంగి పారుతున్న విశాలమైన అలుగు కింద నిలబడి స్నానాలు చేస్తూ యువకులు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు.

ఇది కూడా చదవండి: పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *