SLBC Tunnel Project | కరువు వచ్చినా డెడ్ స్టోరేజ్ నీళ్లతో పంటలు పారిస్తాం: మంత్రి కోమటిరెడ్డి

ఎస్‌ఎల్బీసీ (SLBC) సొరంగ మార్గం నిర్మాణ పనులు పూర్తయితే ఎంతటి కరువు వచ్చినా శ్రీశైలం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ నుండి నీటిని తరలించి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  SLBC Tunnel Project | ఎస్‌ఎల్బీసీ (SLBC) సొరంగ మార్గం నిర్మాణ పనులు పూర్తయితే ఎంతటి కరువు వచ్చినా శ్రీశైలం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ నుండి నీటిని తరలించి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి  ( Komatireddy Venkat Reddy )వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టమని, నూతన పాలకవర్గం కర్షకుల సంక్షేమానికి నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు.

SLBC Tunnel Project | ప్రాజెక్టుకు పునర్‌వైభవం..

జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టి, నల్లగొండ మొత్తానికి సాగునీరు అందించాలనే సంకల్పంతో గతంలో రూ. 2,000 కోట్లతో ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును తలపెట్టామని మంత్రి వివరించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పనులు నిలిచిపోగా, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి పనులను పునఃప్రారంభించామన్నారు. సాంకేతిక కారణాలతో మధ్యలో కాస్త ఆలస్యమైనా, ఇటీవలే మళ్లీ పనులను పునఃప్రారంభించి వేగవంతం చేశామని తెలిపారు. అలాగే బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 35,000 ఎకరాలకు సాగునీరు అందించామని, త్వరలోనే లక్ష ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు.

SLBC Tunnel Project | రూ. 450 కోట్లతో ..

జిల్లాలో వ్యవసాయ, మౌలిక రంగాలు బలోపేతం చేసేందుకు ఏఎమ్‌ఆర్‌పీ (AMRP) కాలువల లైనింగ్ పనులను రూ. 450 కోట్లతో చేపట్టినట్లు మంత్రి తెలిపారు. వీటితో పాటు ముశంపల్లికి సబ్ స్టేషన్, కొత్త రోడ్డు మంజూరు చేశామని వివరించారు. జిల్లాలో కాలువలు, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండితే చుట్టుపక్కల బోర్లు రీఛార్జ్ అవుతాయని, రాబోయే రెండేళ్లలో జిల్లాలో ఎక్కడా మట్టి రోడ్డు అనేది లేకుండా పక్కా రహదారులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించామని చెప్తూ, ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

SLBC Tunnel Project  | ఏఎమ్‌సీ నూతన పాలకవర్గం..

ఈ కార్యక్రమంలో నల్లగొండ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా బీ. హేమలత వెంకటరెడ్డి, వైస్ చైర్మన్‌గా వి. శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  Meta Case India | చిన్నారుల లైంగిక వేధింపుల కంటెంట్‌.. మెటాపై కేసు నమోదు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *