Smartphone Price Hike | స్మార్ట్‌ఫోన్ ప్రియులకు భారీ షాక్.. . ఒక్కసారిగా రూ.4,000 వరకు పెరిగిన ధరలు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Smartphone Price Hike | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు మొబైల్ తయారీ సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. ఇప్పటికే ప్రీమియం, హైఎండ్ ఫోన్ల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. ఇప్పుడు ప్రముఖ బ్రాండ్లయిన శాంసంగ్ (Samsung), షావోమీ (Xiaomi) తమ బడ్జెట్ మరియు మిడ్‌రేంజ్ ఫోన్ల ధరలను భారీగా పెంచేశాయి. ఈ రెండు కంపెనీలు కలిసి మొత్తం 41 స్మార్ట్‌ఫోన్ వేరియంట్లపై రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ధరలను పెంచినట్లు రిటైల్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ పెరిగిన కొత్త ధరలు సోమవారం నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.

Smartphone Price Hike | ధరల పెంపు వివరాలు..

శాంసంగ్ తన గెలాక్సీ ఏ (Galaxy A), ఎఫ్ (Galaxy F) సిరీస్‌లలోని మొత్తం 22 వేరియంట్ల ధరలను సవరించింది. మోడల్, స్టోరేజ్ సామర్థ్యాన్ని బట్టి 3.13 శాతం నుంచి 9.52 శాతం వరకు ధరలు పెరిగాయి.

గెలాక్సీ ఏ07 5జీ: 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21 వేల నుంచి రూ.23 వేలకు చేరగా, 6జీబీ వేరియంట్ ధర కూడా రూ.2,000 పెరిగి రూ.26 వేలకు చేరుకుంది.

గెలాక్సీ ఎఫ్17 5జీ: దీనిలోని అన్ని వేరియంట్లపై రూ.2,000 పెరిగింది. దీంతో 4జీబీ, 6జీబీ, 8జీబీ మోడళ్ల ధరలు వరుసగా రూ.26 వేలు, రూ.29 వేలు, రూ.32 వేలుగా మారాయి.

గెలాక్సీ ఏ17 5జీ: చార్జర్‌తో వచ్చే 6జీబీ వేరియంట్ ధర రూ.32 వేలకు, చార్జర్ లేకుండా వచ్చే మోడల్ ధర రూ.30 వేలకు చేరింది.

గెలాక్సీ ఏ57: ఈ మోడల్‌పై అత్యధికంగా రూ.4,000 పెరిగింది. దీంతో 8జీబీ + 256జీబీ వేరియంట్ రూ.67 వేలకు, 12జీబీ + 256జీబీ మోడల్ ధర రూ.76,499కి ఎగిసింది. వీటితో పాటు గెలాక్సీ ఏ36, ఏ56, ఏ37 మోడళ్ల ధరలు కూడా పెరిగాయి.

Smartphone Price Hike | ఇతర కంపెనీలూ అదే బాటలో..

మరోవైపు షావోమీ సంస్థ తన రెడ్‌మీ (Redmi) పోర్ట్‌ఫోలియోలోని 19 వేరియంట్ల ధరలను 4.26 శాతం నుంచి గరిష్టంగా 18.75 శాతం వరకు పెంచింది. సగటున 10.02 శాతం మేర ధరల పెంపు నమోదైంది. రెడ్‌మీ ఏ7 (4జీబీ+64జీబీ) మోడల్ రూ.13 వేల నుంచి రూ.15 వేలకు, రెడ్‌మీ ఏ7 ప్రో రూ.14 వేల నుంచి రూ.16 వేలకు పెరిగింది. అలాగే రెడ్‌మీ 15ఏ సిరీస్‌పై రూ.2,000 నుంచి రూ.3,000 వరకు ధర పెంచారు. రెడ్‌మీ నోట్ 17 5జీ ప్రారంభ ధర రూ.28 వేల నుంచి రూ.31 వేలకు చేరగా, నోట్ 17 ప్రో 5జీ వేరియంట్లపై రూ.4,000, ప్రో మ్యాక్స్ మోడళ్లపై రూ.3,000, రెడ్‌మీ టర్బో 5పై రూ.2,000 చొప్పున ధరలు పెరిగాయి. మెమరీ చిప్స్, ఇతర విడిభాగాల ధరలు పెరగడంతో తయారీ వ్యయం అధికమవుతోందని, అందుకే ధరల పెంపు అనివార్యమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కాగా, వచ్చే వారం వివో, ఒప్పో, మోటరోలా, రియల్‌మీ సంస్థలు కూడా తమ ఫోన్ల ధరలను పెంచే అవకాశం ఉండటంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది.

ఇది కూడా చదవండి: Uttarakhand Bus Accident | లోయలో పడిన బస్సు.. ఆరుగురి మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *