అక్షరటుడే వెబ్‌డెస్క్: Sridhar Babu Comments | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR )పరిపూర్ణ ఆరోగ్యంతో వందేళ్లకు పైగా బతికుండాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఎవరి మరణాన్నీ కోరుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి కేసీఆర్ అనుభవంతో కూడిన మార్గదర్శకత్వం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
Sridhar Babu Comments | కచ్చితమైన నిబంధనలు ..
చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చించేందుకు కొన్ని కచ్చితమైన నిబంధనలు ఉంటాయని శ్రీధర్ బాబు గుర్తుచేశారు. బీఆర్ఎస్ సభ్యులు సభలో చర్చించాలనుకుంటున్న అంశాలను నిబంధనావళి ప్రకారం లిఖితపూర్వకంగా స్పీకర్‌కు అందజేయాలని ఆయన సూచించారు. చట్టసభల హుందాతనాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శాసనసభ ప్రాంగణంలో లేదా సభ లోపల అసభ్యకరమైన పదజాలం వాడటం, అభ్యంతరకరంగా ప్రవర్తించడాన్ని ఏమాత్రం ఆమోదించబోమని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి, స్పీకర్ స్థానాన్ని గౌరవిస్తూ సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. కేవలం వివాదాలు సృష్టిస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించకుండా.. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు, సూచనలతో ప్రజల పక్షాన నిలబడాలని శ్రీధర్ బాబు హితవు పలికారు.
ఇది కూడా చదవండి: Vande Mataram Row | పూర్తి వందేమాతరం గీతం ఆలపించడంపై కాంగ్రెస్ అభ్యంతరం