అక్షరటుడే, వెబ్‌డెస్క్: Srisailam Project | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నదిపై గల ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి.
కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. నేటి నుంచి తెలంగాణ (Telangana) ‘లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్’లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనుండగా, ఆంధ్రప్రదేశ్ ఎస్ఆర్బీసీ, ఇతర సాగునీటి ప్రాజెక్టుల కోసం నీటిని ఎత్తిపోయడం మొదలుపెట్టనుంది. ప్రస్తుతం జలాశయంలోకి 2,31,168 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 140 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తే ఆ నీరు నాగర్జున సాగర్‌కు వెళ్లనుంది. దీంతో సాగర్ నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది.
Srisailam Project | ఒకే రోజు 20 టీఎంసీలు
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర నుంచి వరద పోటెత్తింది. దీంతో జూరాలకు భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్ట్ నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజు ప్రాజెక్టులోకి 20 టీఎంసీల నీరు వచ్చింది. వరద ఇలాగే కొనసాగితే మరో మూడు నాలుగు రోజుల్లో ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉంది. రాయలసీమ కోసం హెచ్ఎన్ఎస్ఎస్ (HNSS) నుండి ఇప్పటికే నీటిని ఎత్తిపోయడం ప్రారంభమైంది.
ఇది కూడా చదవండి..: Heavy Rain Alert | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన