SRSP Submerged Villages | నీటి అడుగున దాగిన 35 గ్రామాల చరిత్ర.. ఎస్సారెస్పీలో ముగినిన జ్ఞాపకాలెన్నో..

ఎస్సారెస్పీలో కుస్తాపురం రామలింగేశ్వర ఆలయ శిఖరం బయటపడిందన్న వార్త అందరినీ ఆకర్షిస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: SRSP Submerged Villages | ఎస్సారెస్పీలో కుస్తాపురం రామలింగేశ్వర ఆలయ శిఖరం బయటపడిందన్న వార్త అందరినీ ఆకర్షిస్తోంది. కానీ అసలు కథ కుస్తాపురంతో మొదలు కాలేదు, అక్కడితో ఆగలేదు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 35 గ్రామాలు త్యాగం చేశాయి.

SRSP Submerged Villages | నీటి అడుగున మునిగిన గ్రామాలెన్నో..

అందులో 16 గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. 7 గ్రామాలు పాక్షికంగా మునిగాయి. 5 గ్రామాలు బ్యాక్ వాటర్ సమస్యతో ఇబ్బంది పడ్డాయి. మరో 7 గ్రామాలు తమ వ్యవసాయ భూములను కోల్పోయాయి. ఈ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లోని నందిపేట, ఆర్మూర్, బాల్కొండ మండలాలతో పాటు అప్పటి ఆదిలాబాద్ జిల్లాలోని లోకేశ్వరం, దిలావర్‌పూర్, నిర్మల్ మండలాల గ్రామాల త్యాగంతోనే సాకారమైంది. ఒకప్పుడు ఈ గ్రామాల్లో గుడులు, బడులు, రచ్చబండలు, చెరువులు, పొలాలు అన్నీ ఉండేవి. 1963 జూలై 26న అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసినప్పటి నుంచి 20 ఏళ్ల పాటు నిర్మాణం సాగింది. ఆ 20 ఏళ్లలో ఊర్ల ప్రజలు క్రమంగా తమ ఇళ్లు, పొలాలు వదిలి పునరావాస గ్రామాలకు వెళ్లిపోయారు.

SRSP Submerged Villages | కుస్తాపురం ఒక్కటే కాదు..

కుస్తాపురం ఒక్కటే కాదు.. బ్యాక్ వాటర్ పరిధిలో గదేపల్లి, నడుకూడ, నాళేశ్వర్, చిన్నయ్యం, ఉమ్మెడ, ఖానాపూర్, వంటి గ్రామాల పరిసరాల్లో కూడా నీటి అడుగున చరిత్ర దాగి ఉంది. ఈ గ్రామాల శివార్లలోని పొలాలు, పాత కట్టడాలు నీటి మట్టం తగ్గినప్పుడల్లా బయటపడుతుంటాయి. ఉమ్మెడలోని ఉమామహేశ్వర స్వామి ఆలయం ఎప్పుడో పూర్తిగా బయటపడింది. ప్రతి ఊరికి ఒక గుడి ఉండేది. కుస్తాపురంలో రామలింగేశ్వరుడు, మరో ఊరిలో హనుమంతుడు, ఇంకో ఊరిలో పోచమ్మ తల్లి.. వీరందరూ నీటిలోనే ఉండిపోయారు. గ్రామస్తులు కొత్త ఊర్లో కొత్త గుడి కట్టుకున్నా, పాత గుడి మీద మమకారం పోలేదు. అందుకే నీటి మట్టం తగ్గి శిఖరం, ఆలయాలు, కనిపించగానే పడవల్లో వెళ్లి దర్శించుకుంటారు. ‘మా ఊరు ఇక్కడే ఉండేది.. మా ఇల్లు ఆ గుడి పక్కనే ఉండేది’ అని తమ పిల్లలకు, మనవళ్లకు చూపిస్తూ కథలు చెబుతారు.

SRSP Submerged Villages | ఈ ఏడాది ఎందుకు ముందే బయటపడింది…

ఏటా మార్చి, ఏప్రిల్‌లో నీరు తగ్గినప్పుడు మాత్రమే శిఖరాలు కనిపించేవి. ఈ ఏడాది ఎల్​నినో ప్రభావంతో వర్షాలు లేక, ప్రాజెక్టులోకి వరద నీరు చేరక నవంబర్‌లోనే బయటపడ్డాయి. ఇది భక్తులకు దర్శన భాగ్యమే అయినా, రైతులకు మాత్రం హెచ్చరిక. ప్రాజెక్టు నిండకపోతే నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఎక్కడి నుంచి వస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. శిఖరం బయటపడిన ప్రతిసారీ అది కేవలం దైవ దర్శనం కాదు.. మునిగిన 35 గ్రామాల ప్రజల త్యాగానికి గుర్తు. ఆ ఊర్ల జ్ఞాపకాలను, ఆ ప్రజల కష్టాన్ని గుర్తుచేసే జీవన సాక్ష్యం. తిరిగి వర్షాలు పడి ప్రాజెక్టు నిండే దాకా ఈ శిఖరాలు ఇలాగే కనిపిస్తూనే ఉంటాయి. వర్షం వస్తే శిఖరాలు మళ్లీ నీటిలో దాగిపోతాయి.. రైతుల ముఖాల్లో మాత్రం ఆనందం వెల్లివిరుస్తుంది.

ఇది కూడా చదవండి..: Chakratheertham Festival | భక్తిశ్రద్ధలతో చక్రతీర్థం.. లింబాద్రిగుట్టపై ఆధ్యాత్మిక శోభ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *