అక్షరటుడే, వెబ్డెస్క్ : STP Maintenance | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఎస్‌టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు)ల నిర్వహణ లోపాలను నెల రోజుల్లో సరి దిద్దుకోవాలని హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులు, ఎస్టీపీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఎస్టీపీల పనితీరుపై హైడ్రా నేతృత్వంలో జలమండలి, మున్సిపల్ కొర్పోరేషన్, పీసీబీ సంయుక్త తనిఖీలు నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుద్ధి చేసిన నీళ్లలో ఉండాల్సిన ప్రమాణాల విషయమై సమీక్షించారు. నగరంలోని చెరువులను హైడ్రా పునరుద్ధరిస్తోందన్నారు. ఆ చెరువుల్లోకి మురుగు నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేసిన జలాలు మాత్రమే చెరువలోకి వెళ్లాలని రంగనాథ్ తెలిపారు.
STP Maintenance | నిరంతరం పని చేయాలి
గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, ఇతర ప్రాంగణాల్లోని ప్రైవేట్ మురుగునీటి శుద్ధి కేంద్రాలు (STP) నిరంతరం పని చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఎస్టీపీల వివరాలను జలమండలి ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయాలన్నారు. శుద్ధి చేసిన నీటిని తాగునీటికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించాలని సూచింంచారు. ఎస్‌టీపీల నిర్వహణకు ప్రత్యేకంగా కరెంటు మీటర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఎస్‌టీపీలోకి వచ్చే మురుగునీరు, బయటకు వెళ్లే నీరు, విద్యుత్ వినియోగం, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగానికి సంబంధించిన వివరాలను రోజువారీగా నమోదు చేయాలని ఆదేశించారు.
దీనిని కూడా చదవండి : ACB Trap | ఏసీబీకి చిక్కిన ఏఈ, హెల్త్ ఇన్స్పెక్టర్