Swiss Flight Issue | స్విస్ విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో త‌ప్పిన పెను ప్రమాదం..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swiss Flight Issue | దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. జ్యూరిచ్‌కు వెళ్లాల్సిన స్విస్ ఎయిర్‌లైన్స్‌ (Swiss Airlines)కి చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్‌ను చివరి క్షణంలోనే రద్దు చేయాల్సి వచ్చింది.

ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుని ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించింది. వివరాల ప్రకారం, LX147 విమానం రన్‌వేపై టేకాఫ్ కోసం వేగంగా ముందుకు సాగుతుండగా ఇంజిన్‌లో లోపాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు టేకాఫ్‌ను నిలిపివేసి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే విమానాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించారు.

Swiss Flight Issue | కొందరికి గాయాలు..

ఈ విమానంలో మొత్తం 232 మంది ప్రయాణికులు, నలుగురు చిన్నారులు మరియు సిబ్బంది ఉన్నారు. వారందరినీ అత్యవసర స్లైడ్ల ద్వారా వేగంగా బయటకు తరలించారు. అయితే ఈ ప్రక్రియలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. మొత్తం ఆరుగురు గాయపడగా, వారిని చికిత్స కోసం మేదాంత ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్విస్ ఎయిర్‌లైన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సమస్యకు గల అసలు కారణాలను తెలుసుకోవడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అలాగే విమానాన్ని సవివరంగా పరిశీలించేందుకు సాంకేతిక నిపుణుల బృందాన్ని ఢిల్లీకి పంపుతున్నట్లు వెల్లడించింది.

delhi airport

Swiss Flight Issue | ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు, హోటల్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అధికారులు సమయోచితంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన మరోసారి విమాన భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యతను గుర్తు చేసింది. సమయానికి సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు (Pilots), సిబ్బంది చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దీనిని కూడా చదవండి : Amit Shah Mamata Attack | బెంగాల్‌లో మహిళలకు భద్రత కరవు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *