అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Police Sports Games | తెలంగాణ పోలీసుల క్రీడా సంబురాలు అంబరాన్నంటాయి. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని జానకంపేట సీటీసీ (CTC) వేదికగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, విజేతలకు పతకాలు, ట్రోఫీలు అందజేసి అభినందించారు.
Telangana Police Sports Games | జాతీయ స్థాయి లక్ష్యంగా కొత్త విధానం
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. క్రీడలు, పోలీస్ బ్యాండ్, మౌంటెడ్ పోలీసు విభాగాలు పోలీసు శాఖ ప్రతిష్ఠకు, సంప్రదాయానికి ప్రతీకలని కొనియాడారు. తన 27 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో మూడున్నరేళ్ల పాటు నిజామాబాద్‌లో పనిచేశానని, తనకు ఎంతో ఇష్టమైన ఈ గడ్డపై క్రీడా ఉత్సవాలకు హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉందని డీజీపీ గుర్తుచేసుకున్నారు.
Telangana Police Sports Games | ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్‌పై గురి
కేవలం రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా, ఆల్ ఇండియా పోలీస్ క్రీడా పోటీల్లో తెలంగాణ జట్లు సత్తా చాటేలా ప్రతిభావంతులను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు.
క్రీడా కార్యక్రమాల నిర్వహణను లాభనష్టాల కోణంలో చూడకూడదని, ఇవి సిబ్బందిలో ఉత్సాహాన్ని, క్రమశిక్షణను, జట్టు స్ఫూర్తిని నింపి భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.
Telangana Police Sports Games | రికార్డు స్థాయిలో 3,815 మంది క్రీడాకారుల భాగస్వామ్యం!
గతంలో ఒకేచోట పోటీలు నిర్వహించడం వల్ల తక్కువ మందికే అవకాశం దక్కేదని, ఈసారి ఎక్కువ మంది పోలీసు సిబ్బందికి వేదిక కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు క్లస్టర్లుగా పోటీలు నిర్వహించినట్లు డీజీపీ వివరించారు:
- సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం (జులై 7): ఇండోర్ క్రీడల్లో సుమారు 700 మంది పాల్గొన్నారు.
- వరంగల్ క్లస్టర్ (నవంబర్ 2, 3): వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి టీమ్ గేమ్స్‌లో 500 మంది తలపడ్డారు.
- రాకెట్ క్రీడల క్లస్టర్: టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలకు 700 మంది హాజరయ్యారు.
- నిజామాబాద్ క్లస్టర్ (ముగింపు దశ): చివరి విడత పోటీల్లో 585 మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు.
గతంలో కరీంనగర్ పోటీల్లో 2,200 మంది, సైబరాబాద్‌లో 2,530 మంది పాల్గొనగా.. ఈసారి ఐదు క్లస్టర్లలో కలిపి రికార్డు స్థాయిలో 3,815 మంది క్రీడాకారులు పాల్గొనడం విశేషం.
Telangana Police Sports Games | విజేతల వివరాలు ఇవే..
ఈ క్రీడా పోటీల్లో హైదరాబాద్ సిటీ జట్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి పురుషులు, మహిళల విభాగాల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నాయి.
- పురుషుల విభాగం – విజేత (ఛాంపియన్) – హైదరాబాద్ సిటీ ; రన్నరప్ – టీజీఎస్పీ (TGSP) జోన్-2
- మహిళల విభాగం – విజేత (ఛాంపియన్) – హైదరాబాద్ సిటీ ; రన్నరప్ – బాసర జోన్ & టీజీపీఏ (TGPA) జోన్-2
ఈ మెగా క్రీడా ఈవెంట్ విజయవంతం కావడానికి విశేష కృషి చేసిన స్పోర్ట్స్ ఐజీ గజరావ్ భూపాల్, ఆతిథ్యం ఇచ్చిన నిజామాబాద్ సీపీ సాయి చైతన్యతో పాటు వివిధ విభాగాల పోలీసు అధికారులు, సిబ్బందిని డీజీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..