Telangana RERA Fines | రియల్ ఎస్టేట్ అక్రమార్కులకు రెరా షాక్.. ఏలియన్స్‌కు రూ.2 కోట్లు, ఆరో రియాల్టీకి రూ.25 లక్షల జరిమానా!

ఫ్లాట్ల అప్పగింతలో జాప్యం చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన పలు సంస్థలకు కోట్ల రూపాయల జరిమానాలు విధించడంతో పాటు రీఫండ్లు, వడ్డీ చెల్లింపులపై కీలక ఆదేశాలు జారీ చేసింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana RERA Fines | హైదరాబాద్ Hyderabad రియల్ ఎస్టేట్ రంగంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, నిబంధనలకు తూట్లు పొడుస్తున్న బడా నిర్మాణ సంస్థలపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఉక్కుపాదం మోపింది. సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఆశపడే సామాన్య కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రెరా కఠిన నిర్ణయాలు తీసుకుంది.

రిజిస్టర్డ్ అగ్రిమెంట్లు లేకుండా డబ్బులు వసూలు చేయడం, అనుమతుల్లేని ప్రీ-లాంచ్ ఆఫర్లతో మభ్యపెట్టడం, ఫ్లాట్ల అప్పగింతలో జాప్యం చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన పలు సంస్థలకు కోట్ల రూపాయల జరిమానాలు విధించడంతో పాటు రీఫండ్లు, వడ్డీ చెల్లింపులపై కీలక ఆదేశాలు జారీ చేసింది.

Telangana RERA Fines | అగ్రిమెంట్లు లేకుండా వసూళ్లు..

రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ లేకుండానే కొనుగోలుదారుల నుంచి భారీగా నగదు వసూలు చేసిన ఏలియన్స్ డెవలపర్స్‌పై రెరా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థకు ఏకంగా రూ.2 కోట్ల జరిమానా విధించింది. అంతేకాకుండా, వారం రోజుల్లోగా (7 రోజుల్లో) కొనుగోలుదారులకు రిజిస్టర్డ్ అగ్రిమెంట్లు అందజేయాలని గడువు విధించింది.

  • అనుమతులు లేని సౌకర్యాలను చూపిస్తూ తప్పుడు ప్రచారం చేసిన అక్షిత ఇన్‌ఫ్రాకు రూ.10.06 లక్షల జరిమానా పడింది.
  • సేల్ అగ్రిమెంట్ లేకుండా రూ.12 లక్షలు వసూలు చేసిన ఈఎల్‌బీ డెవలపర్స్‌కు రూ.3.20 లక్షల ఫైన్ వేసింది.
  • ఆలేఖ్య ఇన్‌ఫ్రా డెవలపర్స్ కొనుగోలుదారుల వద్ద వసూలు చేసిన రూ.17.42 లక్షలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
  • కొంపల్లిలోని భారతి బిల్డర్స్ ఇద్దరు బాధితులకు రూ.9.30 లక్షల చొప్పున రీఫండ్ చేయాలని తేల్చిచెప్పింది.

Telangana RERA Fines | ప్రీ-లాంచ్ మాయాజాలానికి చెక్..

రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ‘ప్రీ-లాంచ్’ పేరుతో సోషల్ మీడియా, డిజిటల్ మాధ్యమాల్లో ఊదరగొడుతున్న సంస్థల ఆట కట్టించేందుకు రెరా సుమోటోగా విచారణ చేపట్టి కొరడా ఝళిపించింది.

కొండాపూర్‌లోని ‘ఆరో సఫైర్’ ప్రాజెక్టుకు రెరా అనుమతి లేకుండానే (8 ఎకరాల్లో 4 టవర్లు, 1,300 ఫ్లాట్లు, రూ.2 కోట్ల నుంచి ధర అంటూ) ప్రచారం నిర్వహించిన ఆరో రియాల్టీకి రూ.25 లక్షల జరిమానా విధించింది. 30 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది.

అనుమతులు లేకుండా ప్రాజెక్టుల ప్రకటనలు ఇచ్చిన జనప్రియ సంస్థకు రూ.10 లక్షల జరిమానా వేసింది. చందానగర్‌లోని బహితీ, సైనిక్‌పురిలోని ఆల్టెయిర్ ప్రాజెక్టులకు అనుమతులు లేకుండానే ప్రచారం చేసినట్లు గుర్తించింది. అలాగే నైల్ వ్యాలీ, లేక్ ఫ్రంట్, సితార ప్రాజెక్టుల ప్రకటనల్లో రెరా రిజిస్ట్రేషన్ నంబర్లను స్పష్టంగా చూపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెరా నమోదు పూర్తయ్యే వరకు ఈ ప్రాజెక్టుల బుకింగ్స్, అమ్మకాలు, ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Telangana RERA Fines | ఫ్లాట్ల అప్పగింతలో ఆలస్యం చేస్తే 10.85% వార్షిక వడ్డీ కట్టాల్సిందే!

గడువు ముగిసినా ఫ్లాట్లు అప్పగించకుండా కొనుగోలుదారులను ఇబ్బంది పెడుతున్న బిల్డర్లకు రెరా గట్టి హెచ్చరిక పంపింది.

వాసవి రియల్టర్స్ సంస్థ రూ.33.60 లక్షలు, రూ.44.80 లక్షల మొత్తాలపై 10.85 శాతం వార్షిక వడ్డీని పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఫ్లాట్ల అప్పగింతలో జాప్యం చేసిన ఇతర సంస్థలు కూడా ఇదే తరహాలో 10.85% వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది.

భువన్ తేజ ఇన్‌ఫ్రా తన ప్రాజెక్టుల్లో పనులు పూర్తి చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) పొందాలని, ఓసీ వచ్చిన 60 రోజుల్లోగా ఫ్లాట్లను కొనుగోలుదారులకు అప్పగించాలని నిర్దేశించింది.

ఈఎల్‌బీ కాస్మోపాలిస్ ప్రాజెక్టులో పెండింగ్ పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని, ట్రూ ప్రైడ్ బాచారం లేఅవుట్‌లో 60 రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. శ్రీ సూర్య డెవలపర్స్, టీఎన్‌ఆర్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ సొంత ఖర్చులతో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.

నానక్‌రామ్‌గూడ ఎంపైర్ అర్బానా ప్రాజెక్టులో మిగిలిన మొత్తాన్ని 30 రోజుల్లో కొనుగోలుదారుల సంఘానికి అప్పగించాలని ఆదేశించగా, అర్బనైజ్ బిల్డర్స్ వివాదంలో కొనుగోలుదారులకు రూ.41.94 లక్షలు రీఫండ్ చేసేందుకు సంస్థ అంగీకరించింది.

Telangana RERA Fines | కోర్టు కేసులు దాచిపెడితే ఓసీ వచ్చినా వదలం

భూ వివాదాలు, పెండింగ్ కోర్టు కేసుల వివరాలను కొనుగోలుదారుల నుంచి దాచిపెట్టడాన్ని రెరా తీవ్రమైన నేరంగా పరిగణించింది.

కాప్రాలోని ‘జీకేహెచ్ ప్రవిష్ అబోడ్’ ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ కేసుల వివరాలను వెల్లడించని జీకేహెచ్ ప్రాపర్టీస్‌కు రూ.6.10 లక్షల జరిమానా విధించింది. ప్రాజెక్టు పూర్తయి ఓసీ వచ్చినంత మాత్రాన గతంలో చేసిన తప్పులకు మినహాయింపు ఉండదని రెరా తేల్చిచెప్పింది.

పుప్పాలగూడలోని వెస్ట్రన్ విండ్సర్ పార్క్ ప్రాజెక్టుపై సుమోటో విచారణ చేపట్టిన రెరా, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పెండింగ్ కోర్టు కేసులు, న్యాయస్థానాల ఉత్తర్వుల పూర్తి వివరాలను 30 రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుతానికి జరిమానా విధించకుండా విచారణను ముగించినప్పటికీ, భవిష్యత్తులో తప్పుడు సమాచారం ఇచ్చినా, నిజాలు దాచినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Telangana RERA Fines | కొనుగోలుదారులకు కనువిప్పు

తెలంగాణ రెరా తీసుకున్న ఈ వరుస నిర్ణయాలు రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా ‘ప్రీ-లాంచ్’ ఆఫర్ల పేరుతో తక్కువ ధరలకు ఆశపడి మోసపోతున్న కొనుగోలుదారులకు ఇది ఒక కనువిప్పు.

ఇల్లు, ప్లాట్ కొనుగోలు చేసే ముందు సంబంధిత ప్రాజెక్టుకు TG RERA రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో లేదో, కోర్టు వివాదాలు ఏమైనా ఉన్నాయో.. లేదో అధికారిక వెబ్‌సైట్‌లో సరిచూసుకోవడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *