అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tukkuguda Nurse Murder | ఇటీవల హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సు హత్యాచారానికి గురైన ఘటనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు, సంబంధిత సంస్థ నిర్వహణలో ఏమైనా నిర్లక్ష్యాలు ఉన్నాయా, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలు అమలయ్యాయా.. అన్న అంశాలన్నింటినీ విచారణలో పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Tukkuguda Nurse Murder | సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా..
ఈ కేసులో నిందితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తును అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాల సేకరణను వీలైనంత వేగంగా పూర్తి చేసి సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు కేసును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.
ఈ కేసులో బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించాలని ఆదేశించారు. న్యాయశాఖ, పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి కేసు విచారణలో జాప్యం జరక్కుండా చూడాలని సూచించారు.
Tukkuguda Nurse Murder | మంత్రుల పరామర్శ..
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.
ఘటనకు కారణమైన వ్యవస్థాపరమైన లోపాలను గుర్తించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.