అక్షరటుడే, వెబ్డెస్క్ : Vijay Sai Reddy | మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ (YS Jagan) మత మార్పిడులను ప్రోత్సహించారని ఆరోపించారు. హిందువుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు.
విజయ సాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కొత్త పార్టీ పెడతానని గతంలో ప్రకటించారు. తాజాగా మాట్లాడుతూ.. జగన్పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో వందల చర్చీలు కట్టడానికి ఆయన ప్రోత్సహించారన్నారు. హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి సహకరించలేదని విమర్శించారు. ఏఈ నూకరాజ్ కుటుంబం హత్య కేసులో నిందితుడు సాదిక్ టెర్రరిస్ట్ అని విజయ సాయిరెడ్డి ఆరోపించారు. జగన్ భవిష్యత్లో కాంగ్రెస్లో జతకట్టే అవసరం వస్తుందేమోనని, ఈ విషయం గురించి మాట్లాడటం లేదన్నారు.
Vijay Sai Reddy | ఆ దిశలో విచారణ చేయాలి
పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితుడు సాదిక్ టెర్రరిస్ట్ అని విజయ సాయిరెడ్డి అన్నారు. సాదిక్ తోపాటు మరో 10 సభ్యుల ముఠా ఉందని ఆరోపించారు. ఏఈ కుటుంబాన్నే కాదు మరో 10 కుటుంబాలను కూడా సాదిక్ వేధించాడని పేర్కొన్నారు. పోలీసులు ఆ దిశగా ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. జగదీశ్ రెడ్డి మరణం కూడా సాదిక్ చేసిన హత్యే అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి ఐదేళ్లకు ఒకసారి కూటములను మారుస్తారని ఆయన సెటైర్లు వేశారు. భవిష్యత్లో కాంగ్రెస్తో జత కట్టాల్సి వస్తుందనే.. సాదిక్ విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష వైసీపీ స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో కొత్త పార్టీ
తనకు బీజేపీలో చేరే ఆలోచన లేదని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తానన్నారు. టీడీపీ, వైసీపీతోపాటు పార్టీలన్నీ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో చెబుతానని పేర్కొన్నారు. మూడు, నాలుగు నెలల్లో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని తెలిపారు. కొత్త పార్టీ, విధివిధానాలను త్వరలోనే వివరిస్తానని ఆయన వెల్లడించారు. గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ.. తర్వాత కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు.
ఇది కూడా చదవండి..: CM Chandrababu | అనకాపల్లి దేశంలో నంబర్ వన్ అవుతుంది : చంద్రబాబు